Guntur Collector Vivek Yadav: జనవాసాల్లో మద్యం అమ్మకాలు వద్దంటూ చాలామంది నిరసనలు తెలిపిన సంఘటనలను మనం ఎన్నో చూసుంటాం.. కానీ.. ఓ మద్యం ప్రియుడు తమ దగ్గర మద్యం షాపు (liquor shop) ఏర్పాటు చేయాలంటూ డైరెక్ట్‌గా కలెక్టర్‌కే ఫోన్ చేశాడు. అదేంటి.. మద్యం షాపు కోసం ఫోన్ చేయడం ఎంటీ అని ఆలోచిస్తున్నారా..? వినడానికి కొంచెం వింతగా అనిపించినా.. ఇది నిజంగా జరిగింది. అది కూడా ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గుంటూరు కలెక్టరేట్ (Guntur Collectorate) లో ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు స్పందన (గ్రీవెన్స్ డే) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు, సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు రాలేని పేద వాళ్ల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమస్యలున్న వారు ప్రతి సోమవారం నేరుగా కలెక్టర్‌కే ఫోన్ చేసి తమ సమస్యను వివరించవచ్చు. కలెక్టర్ వివేక్ యాదవ్ సమస్య తెలుసుకున్న తర్వాత వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. వయస్సులో పెద్ద వాళ్ళకు, మహిళలకు ఈ కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది.
సాధారణంగా ఫించన్ రావడం లేదని, జగనన్న కాలనీ స్థలం, ఇల్లు కోసం, రేషన్ కార్డు తీసేశారని ఇలాంటి సమస్యలను ఫిర్యాదు దారులు డయల్ యువర్ కలెక్టర్ లో ప్రస్తావిస్తుంటారు. నిన్న వచ్చిన ఫిర్యాదు తో కలెక్టర్ వివేక్ యాదవ్ సైతం విస్తుపోయారు. ఎప్పటిలాగే నిన్ను కూడా కలెక్టర్ వివేక్ యాదవ్ డయల్ యువర్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. రెండు, మూడు ఫోన్ కాల్స్ తర్వాత చేబ్రోలు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. కలెక్టర్ వివేక్ యాదవ్ ఎప్పటిలాగే మీ సమస్య చెప్పమని అడిగారు. వెంటనే అవతలి వ్యక్తి చేబ్రోలులో రెండో మద్యం షాపు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉన్న ఒక్క మద్యం షాపు వద్ద భారీ క్యూలైన్లు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశాడు. అంతేకాదు క్యూలైన్లలో వేచి ఉండలేపోతున్నామని మీరు దయతో మరోషాపు ఏర్పాటు చేయాలని కోరాడు. సమస్య విన్న వెంటనే కలెక్టర్ వివేక్ యాదవ్ విస్తుపోయారు. వెంటనే తేరుకున్న కలెక్టర్.. సమస్య పరిష్కరిస్తామని చెప్పి కాల్ కట్ చేశారు. కాల్‌కట్ అయిన వెంటనే ప్రోగ్రాంలోని వారంతా వింత సమస్య గురించి విని నవ్వుకున్నారు. అనంతరం కలెక్టర్ ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారించాలని సూచించారు.
-టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్.. గుంటూరు
Also Read: