Yanam: యానాంను ముంచెత్తిన గోదావరి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై పర్యటన

|

Jul 19, 2022 | 10:38 AM

కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పరీవాహక ప్రాంతాలను కకావికలం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ముంపు ప్రాంతాలను ముంచేసింది. ప్రస్తుతం వరద ఉద్ధతి తగ్గుతున్నప్పటికీ.. భద్రాచలం, ధవళేశ్వరం (Dhawaleshwaram Barrage) వద్ద...

Yanam: యానాంను ముంచెత్తిన గోదావరి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై పర్యటన
Governor Tamilisai
Follow us on

కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పరీవాహక ప్రాంతాలను కకావికలం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ముంపు ప్రాంతాలను ముంచేసింది. ప్రస్తుతం వరద ఉద్ధతి తగ్గుతున్నప్పటికీ.. భద్రాచలం, ధవళేశ్వరం (Dhawaleshwaram Barrage) వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు బాధితులను పరామర్శించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. మంగళవారం యానాం (Yanam) లో పర్యటించనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ హోదాలో ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ పర్యటన కోసం గవర్నర్ తమిళిసై.. హైదరాబాద్‌ నుంచి ఉదయం 8.45 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో యానాం వెళ్లనున్నారు. యానాంలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 4,400 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో నాలుగు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పుదుచ్చేరి విపత్తు నిర్వహణ అథారిటీ డిప్యూటీ కలెక్టర్ ఎన్. తమిళసేవన్ ఒక ప్రకటనలో తెలిపారు.

వర్షాలు తగ్గుముఖం పట్టి, వరద ఉద్ధృతి తగ్గుతున్నా.. యానాం లో మాత్రం పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో గౌతమీ పాయ కారణంగా వరద నీరు పోటెత్తింది. అంతే కాకుండా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా గోదావరికి (Godavari) చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఇల్లు వదిలి బయటకు వస్తే సామగ్రి దొంగల పాలవుతుందని భయపడి, సురక్షిత ప్రాంతానికి వెళ్లడం లేదు.

కాగా.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు, ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలానికే మాత్రమే గవర్నర్ పర్యటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..