పాడేరు, డిసెంబర్ 12: అల్లూరి ఏజెన్సీలో జలపాతాలు సవ్వడి చేస్తున్నాయి. పాల నురగలా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. దివి నుంచి భువికి జాలు వాడుతున్నట్టు ఎత్తయిన కొండల నుంచి జలజలా జారుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వందల అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పరవళ్ళు తొక్కుతూ పడుతున్న ఆ జలపాతాలను చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు. ఇటీవల ఏజెన్సీలో వర్షాలు పడటంతో.. జలపాతాల అందాలు మరింత పెరిగాయి. ఆ ప్రకృతి అందాలను మనమూ చూసొద్దామా..?
శీతాకాలం వచ్చిందంటే చాలు.. అల్లూరి ఏజెన్సీలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి. పొగ మంచు, ప్రకృతి సోయగాలు, మంచు తెరలను చిలుచుకుంటూ లేలేత కిరణాల శుభోదయం.. ఇలా ఒక్కటేంటి..? ప్రకృతి ప్రేమికులకు భూతల స్వర్గాన్ని తలపించేలా ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకవైపు అయితే.. శీతాకాలంలో వర్షాలు కురిసేటప్పుడు అక్కడి ప్రకృతి మరింత పులకిస్తుంది. ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలు సవ్వడి చేస్తూ ఉంటాయి. వాటిని చూడాలంటే రెండు కళ్ళు చాలవు మరి..! ఏజెన్సీలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకుల సీజన్. ఏజెన్సీలో పచ్చటి కొండల నడుమ జలజల పారే జలపాతాల మధ్య అందాలు తిలకించడానికి సందర్శకులు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. ఏజెన్సీలో ఆకట్టుకునే విధంగా జలపాతాలు, మేఘాలను తాకే కొండలు, పాడేరు అరకు లంబసింగిలోని ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించి తనివితీరా ఆస్వాదిస్తారు. శీతాకాలంలోని వర్షాల అనంతరం ఏజెన్సీలో జలపాతాలా ప్రకృతి అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. వాటర్ ఫ్లో పెరిగి.. ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. మన్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలపాతాల సవ్వడి పెరిగింది. వాగులు, గెడ్డలు ఉప్పొంగటంతో జలపాతాలు పాలనురగలా ప్రవహిస్తున్నాయి.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు సమీపంలో తారాబు జలపాతం ప్రత్యేక ఆకర్షణ. వందకు పైగా అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అలాగే అనంతగిరి మండలంలోని కొత్తపల్లి జలపాతం ఏజెన్సీల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఎత్తయిన కొండల మధ్యలో నుంచి జలజల సవ్వడి చేసుకుంటూ జాలువారుతున్న ఆ జలపాతం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తోందని పర్యటకులు అంటున్నారు.
ఇక డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతం ప్రసిద్ధి చెందింది. అనంతగిరి మండలంలో కటిక వాటర్ ఫాల్స్ ప్రత్యేకతను మాటల్లో వర్ణించలేం. ఆకాశ మేఘాల్లోంచి పడుతున్నట్లు కొండల మధ్య నుంచి జాలువారుతూ కనువిందు చేస్తుందీ జలపాతం. ఇక ఏవోబీలోని బాబుసాల సమీపంలోని జడిగుడ, 2700 అడుగుల పైనుంచి జాలువారే డుడుమ జలపాతాల అందాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఏజెన్సీలో మరికొన్ని చిన్న జలపాతాలు సైతం ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.
సీజన్‌కుతోడు.. వాతావరణం కలిసి రావడంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలకు భారీగా రద్దీ పెరుగుతుంది. వీకెండ్స్ లో ఆయా ప్రాంతాలు రష్‌గా మారుతున్నాయి. ఒక్క రోజులోనే కొత్తపల్లి జలపాతానికి 3 లక్షలు ఆదాయం వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వంజంగి మేఘాల కొండకు అయితే ఒక రోజులోని ఆరు లక్షల ఆదాయం సమకూరింది. అయితే కొన్ని పర్యాటక ప్రాంతాలైన జలపాతాల సమీపంలో.. కనీస సౌకర్యాలు లేమి పర్యాటకులను అసహనానికి గురిచేస్తుంది. అయితే ఇప్పుడు ఆయా ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్థానికుల సహకారంతో పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పాడేరు ఐటీడీఏ సీఓ అభిషేక్ అంటున్నారు. ఎముకలు కొరికే చలిలో ఎక్కడ చూసినా సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రకృతి సోయగాలతో అలరారుతోంది. రోజూ దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పటికీ.. మరికొన్ని ప్రాంతాల్లో వసతులు మరింత పెంచి, పర్యాటకులకు పూర్తిస్థాయిలో ప్రకృతి అందాలను ఆస్వాదించేలా అనుభూతిని మిగిల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.