
కర్నూల్ జిల్లా వింత ఆచారాలకు, శతాబ్దాల నాటి విచిత్ర పద్ధతులకు నిలయం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఊరిలో ఇలాంటి నమ్మకాలు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని పండుగలు సరదాగా అనిపిస్తే, మరికొన్ని సాంప్రదాయంగా సాగుతాయి. కానీ కొన్ని ఆచారాలు మాత్రం చూసేవారిని నివ్వెరపోయేలా చేస్తాయి. ఇప్పుడు మనం చూడబోయే ఆచారం కూడా సరిగ్గా అలాంటిదే. దీన్ని అపారమైన నమ్మకం అనాలో… లేక మూఢనమ్మకం అనాలో అర్థంకాని పరిస్థితి. పసిపిల్లలను నేలపై పడుకోబెడితే.. వందలాది మంది భక్తులు గోవిందా.. గోవిందా అంటూ వారి పైనుంచి దాటుకుంటూ పరుగులు తీస్తారు. ఈ క్రమంలో కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొంటుంది. అసలు ఏమిటీ ఆచారం? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనీలోని శ్రీ గుంటి రంగస్వామి ఆలయంలో జరిగే ఈ వింత తతంగం వెనుక ఉన్న కథేంటి? ఇప్పుడు చూద్దాం..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనీలో ప్రతి ఏటా శ్రావణమాసం వచ్చే మొదటి శనివారంకు ముందు శుక్రవారం అర్ధరాత్రి వెంకటాపురం కాలనీ నుంచి సుమారు వేయి మంది భక్తులు కత్తులు, కర్రలు, వ్యవసాయ పనిముట్లు పట్టుకొని యుద్ధ వాతావరణం తలపించేలా అరుపులు కేకలు వేస్తూ పరుగులు పెడతారు. 40 కి.మీ మేర ఇలా సందడి చేస్తూ, కాలినడకన వెళ్లి గంగవరం దగ్గర ప్రవహిస్తున్న తుంగభద్ర నదికి వెళ్లి నీటి జలాన్ని సేకరిస్తారు. ఆ నీటిని తెచ్చి వెంకటాపురం కాలనీలోని గుంటిరంగా స్వామికి జలాభిషేకం నిర్వహిస్తారు.
స్వామికి అభిషేకం చేసిన తర్వాత పూలతో అలంకరించిన ఆయుధాలను చేతపట్టి గోవింద నామస్మరణలు చేస్తూ గుడి చుట్టూ తిరుగుతారు. ఇలా ఐదు సార్లు ప్రదక్షణలు చేస్తారు. అలా నది జలాలతో తిరిగితే గుడిలో కొలువై ఉన్న స్వామినే ఇలా గుడి చుట్టూ తిరుగుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఆ సమయంలో శారీరక, మానసిక, బాధతో ఇబ్బంది పడేవారు గుడి చుట్టూ పడుకుంటారు. ఆలా పడుకున్న వారిపై నుంచి నది జలాలు తెచ్చిన వారు దాటుకుంటూ వెళ్తారు. ఆ సమయంలో వారి కాలి దూళి తగిలి, తమ మీద నుంచి వెళితే వ్యాధులు నయం అవుతాయని వారి నమ్మకం. ఆయుధాలు పట్టుకొని ఇలా పరుగులు తీస్తే నిజంగా వానలు కురిసి పంటలు బాగా పండుతాయని అక్కడి వారి నమ్మకం. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ కార్యక్రమంను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
వీడియో చూడండి..