Mekapati goutham reddy : రాయలసీమలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వినతి పత్రం అందజేశారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఆయన తెలిపారు. మానవవనరులు, నైపుణ్యం, పారిశ్రామిక భూ బ్యాంకు సహా మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సహకరించాలని గౌతమ్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇంటిగ్రేటెడ్ టాయ్ పార్కుల స్థాపనకు సైతం సహకారం అందించవలసిందిగా కేంద్ర మంత్రికి మేకపాటి గౌతమ్ రెడ్డి విన్నవించారు.
బొమ్మల తయారీ పరిశ్రమరంగ అభివృద్ధి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని కూడా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రికి ఏపీ మంత్రి వెల్లడించారు. సంప్రదాయ, ఎలక్ట్రానిక్ , ఖరీదైన బొమ్మలను తయారు చేసే ఇంటిగ్రేటెడ్ టాయ్స్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలను కూడా వినతి పత్రంగా మంత్రి గౌతమ్ రెడ్డి కేంద్రమంత్రికి సమర్పించారు. టాయ్స్ పార్క్ ఏర్పాటులో కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరారు మంత్రి మేకపాటి.
ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 13 జిల్లాల నుంచి మూడు రకాల ఉత్పత్తులను గుర్తించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ 13 రకాల వస్తువులలో చేనేత, బొమ్మలు, హస్తకళలు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తులూ ఉన్నాయని వెల్లడించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ను అమలు చేయడంలో ఇప్పటికే కార్యాచరణ, ప్రణాళికలు పూర్తయ్యాయని అందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించవలసిందిగా కేంద్ర మంత్రిని, ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు.
Read also :