మూడు సంవత్సరాలుగా ఓ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేశాడు. కానీ అతడికి మార్కులు లిస్ట్ రాలేదు. అవును ఉపాధ్యాయుల తప్పుతో ఆ విద్యార్థికి మార్కుల లిస్ట్ రాలేదు. దీంతో అతను పై చదవులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై బాధిత విద్యార్థి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామానికి చెందిన వంశీ అమడగుంట్ల గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఉంటూ జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. కరోనా వల్ల ఏపీ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులకు గ్రేడ్ మార్కులు ఇచ్చింది.
పాస్ అయ్యాను ఇక ఇంటర్లో జాయిన్ అవ్వాలని అనుకున్న వంశీ పాఠశాలకు వెళ్లి గురువులను మార్కుల లిస్ట్ ఇవ్వాలని కోరాడు. కానీ వంశీకి అనుకోని ఘటన ఎదురైంది. ఉపాధ్యాయులు చెప్పిన సమాధానంతో అతడికి దిమ్మదిరిగింది. వంశీ నీ పేరు ఆన్లైన్ నమోదు కాలేదు. ఈ సంవత్సరం నువ్వు తప్పినట్లే అని అన్నారు. నిరాశకు గురైన వంశీ ఇంటికి తిరిగొచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. ఆందోళన చెందిన వారు పాఠశాలకు వెళ్లి పూర్తి సమాచారం కోరారు. ఆన్లైన్లో వంశీ పేరు నమోదు కాకపోవడంతో అతని మార్కుల లిస్ట్ రాలేదని ఉపాధ్యాయులు చెప్పారు.
అమడగుంట్ల వసతి గృహంలో ఉండి 3 సంవత్సరాలుగా చదివిన మా అబ్బాయి పైచదువులకు పోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని.. ఎలాగైనా మార్కుల లిస్ట్ ఇవ్వాలని వంశీ తండ్రి ఉప్యాధ్యాయులను కోరాడు. తామేమి చేయలేమని ఉపాధ్యాయులు చేతులెత్తేశారు. గురువుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడి జీవితం నాశనం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు కూడా చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. బాధ్యులైన వారు వచ్చి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
Read Also.. Vehicle Number Plate: ఇక నుంచి వాహనం నెంబర్ ప్లేట్లపై ఇలాంటివి కనిపిస్తే మీ పని అంతే..!