Nandyal Murder: నంద్యాల జర్నలిస్ట్ హత్యోదంతంపై డీజీపీ సీరియస్.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశం

|

Aug 09, 2021 | 11:48 AM

Nandyal Journalist Murder Case: కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ కేశవ్ హత్య ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. జర్నలిస్ట్ హత్యోదంతంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.

Nandyal Murder: నంద్యాల జర్నలిస్ట్ హత్యోదంతంపై డీజీపీ సీరియస్.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
Keshava Murder
Follow us on

కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ కేశవ్ హత్య ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. జర్నలిస్ట్ హత్యోదంతంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. హత్యకు పాల్పడిన నింధితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌తో పాటు జర్నలిస్ట్ కేశవ్ హత్యతో ప్రమేయం ఉన్న అందరినిపైనా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి , కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. స్థానికంగా అరాచకాలు సృష్టిస్తున్న గుట్కా మాఫియా అరాచకాలను బయటపెట్టారన్న అక్కసుతో జర్నలిస్టు కేశవను దారుణంగా హతమార్చడం తెలిసిందే.

నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్‌లో కేశవ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. గుట్కా మాఫియాతో నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్యకున్న సంబంధాలపై తన యూట్యూబ్ ఛానల్‌లో వార్త రాశాడు. నంద్యాల టూ టౌన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుబ్బయ్య… అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  దీని ఆధారంగానే తనను ఇటీవల ఎస్పి సస్పెండ్ చేయడంతో కేశవపై కానిస్టేబుల్ సుబ్బయ్య కక్ష కట్టాడు. నంద్యాలలో రాత్రి పదిన్నర గంటల సమయంలో మాట్లాడాలి రమ్మని కేశవను కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు నాని పిలిపించుకున్నారు. కేశవ వచ్చిన వెంటనే స్క్రూ డ్రైవర్ తో విచక్షణా రహితంగా పొడిచారు. గాయాలపాలైన కేశవ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.

అర్ధరాత్రి నంద్యాల చేరుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి  హత్య స్థలాన్ని పరిశీలించి కుటుంబీకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేశవను కానిస్టేబుల్ సుబ్బయ్య హత్య చేశాడని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎస్పీకి తెలిపారు. కేశవ హత్య కేసుకు సంబంధించి కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు నానిలపై హత్య కేసులు నమోదయ్యాయి. హత్య చేసిన వెంటనే ఇద్దరు కూడా పారిపోయారు వారి కోసం ప్రత్యేకంగా రెండు టీములు గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు నానిలు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని.. పోలీసుల  ప్రాథమిక విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని ఎస్పీ తెలియజేశారు.

అటు జర్నలిస్ట్ కేశవ దారుణ హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కన్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. నేడు జిల్లాలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హత్యకు కారణమైన కానిస్టేబుల్ సుబ్బయ్య, ఆయన సోదరుడు నానిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read..

టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు దుర్మరణం.. కంకర లోడ్‌తో వెళుతుండగా..

టాప్‌ హీరోయిన్‌ పోరి మోని లీలలు.. సంపన్నుల పిల్లలే టార్గెట్‌.. అమ్మాయిలను పరిచయం చేసి..

Traffic Challans: విసిగిపోయాడు.. చిర్రెత్తుకొచ్చింది.. తగలబెట్టాడు.. వికారాబాద్ జిల్లాలో సంచలన ఘటన