తిరుపతి వెళ్లే వారికి సూపర్ గుడ్ న్యూస్.. రూ.1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్.. తగ్గనున్న జర్నీ టైమ్..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణా నదిపై భారీ ఐకానిక్ వంతెన నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. రూ.1000 కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తాజాగా అటవీ శాఖ కూడా అనుమతులు మంజూరు చేసింది. ఈ వంతెన పూర్తయితే తెలంగాణ నుంచి తిరుపుతి వెళ్లే ప్రయాణికులకు సుమారు 80 కిలీమీటర్ల దూరం తగ్గనుంది.

తిరుపతి వెళ్లే వారికి సూపర్ గుడ్ న్యూస్.. రూ.1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్.. తగ్గనున్న జర్నీ టైమ్..
Krishna River Bridge Project

Updated on: Mar 06, 2026 | 10:52 AM

తెలుగురాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల, ఏపీలోని ఆత్మకూరును కలుపుతూ కృష్ణా నదిపై రూ.1000 కోట్ల వ్యయంతో ఓ ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. జాతీయ రహదారి 167ను ఎక్స్‌స్టెండ్ చేసేందుకు సుమారు 60 ఎకరాల అటవీభూమి ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే 60 ఎకరాల అటవీభూమిలో సంచరించే వణ్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులకు అటవీశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అటవీభూమిలో రోడ్డు నిర్మాణం చేపడుతున్నందున మరో ప్రాంతంలో మొక్కలు నాటే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భూమి మళ్లింపునకు NPV రూపంలో నిధులు జమ చేయాలని.. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను కూడా తప్పక పాటించాలని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ చేపట్టే సంస్ధ అటవీశాఖ నిబంధనలు సక్రమంగా పాటిస్తేనే స్టేజ్-2 కోసం అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ఇక కృష్ణా నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య సుమారు 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. అంతేకాదు ఈ వంతెన పూర్తైయితే ఆ ప్రాంతాల్లోని నల్లమల అడవులు, శ్రీశైలం టెంపుల్, సోమశిల సిద్ధేశ్వర ఆలయాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే ఏపీ, తెలంగాణ మధ్య రవాణా మార్గాలు మెరుగుపడి వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు సైతం పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us