Watch: పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇలాంటి సీన్ మీరెప్పుడూ చూసుండరు!
ప్రకాశం జిల్లాలో పొట్టేళ్ల పందాలు హోరాహోరీగా సాగాయి. బల్లికురవ మండలం కొణిదన గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పొట్టేళ్ల పోటీలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. నువ్వా-నేనా అన్నట్లు తలపడిన ఈ పొట్టేళ్ల పోరును చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. పందెం గెలిచిన పొట్టేళ్లకు, వాటి యజమానులకు నిర్వాహకులు భారీ నగదు బహుమతులతో సత్కరించారు.

ప్రకాశం జిల్లా కొణిదన గ్రామంలో ఈ పోటీలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు, గ్రామ దేవతల తిరునాళ్ల సందర్భాల్లో ఈ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాంగానే ఈసారి కూడా ఇక్కడ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మేలు రకం పొట్టేళ్లు తలపడ్డాయి. వాటి యజమానులు తమ పొట్టేళ్లను ఎంతో ఉత్సాహంతో బరిలోకి దింపారు. ఒకదానికొకటి ఢీ అంటే ఢీ అన్నట్లు తలలు కొట్టుకుంటూ ఉంటే.. ఆ శబ్దానికి మైదానం దద్దరిల్లిపోయింది.
పొట్టేళ్లు పంతానికి దిగి కొట్టుకుంటుంటే.. చుట్టూ ఉన్న జనం కేరింతలు కొడుతూ వాటిని ఉత్సాహపరిచారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు ఒక్క ప్రకాశం జిల్లా నుండే కాకుండా.. పొరుగునే ఉన్న పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోటీలు చివర వరకు ఉత్కంఠభరితంగా సాగాయి. పందెం గెలిచిన పొట్టేళ్లకు, వాటి యజమానులకు నిర్వాహకులు భారీ నగదు బహుమతులతో పాటు మెమెంటోలను అందజేశారు. పల్లెటూరి సంప్రదాయ క్రీడల్లో ఒకటైన ఈ పొట్టేళ్ల పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
