
చారిత్రక కొండవీడు కోటలో మరో దాన శాసనం వెలుగులోకి వచ్చింది. రుద్ర పాద శిఖరం (ఆదం షఫీ బోడు)పై ఉన్న శివాలయం గర్భాలయ ద్వారపాలక స్తంభంపై ఈ శాసనాన్ని గుర్తించారు. కొండవీడు అభివృద్ధి కమిటీ సభ్యులు శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను పరిశీలిస్తుండగా శాసనం బయటపడింది. ఇందులో తాపనాచార్యులకు దానంగా కొంత పొలం ఇచ్చినట్లు శాసన సారాంశంగా తెలుస్తోందని కమిటీ కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. కొండవీడు కోటకు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రెడ్డి రాజులు అద్దంకి నుంచి తమ రాజధానిని కొండవీడుకు మార్చుకుని సుమారు వందేళ్ల పాటు పరిపాలన సాగించారు. రాజుల కాలం నాటి నిర్మాణాలు, శిలా శాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు ఇప్పటికీ కొండలపై కనిపిస్తుంటాయి. ఈ చారిత్రక సంపదను వెలుగులోకి తీసుకురావడంపై కొండవీడు అభివృద్ధి కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. కమిటీ కన్వీనర్ శివారెడ్డి తన అనుచరులతో కలిసి కొండవీడులోని శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను పరిశీలిస్తూ ఇప్పటికే కొన్ని శాసనాలను గుర్తించారు. ఇందులో భాగంగా జూన్‌లో రుద్ర పాద శిఖరంపై ఉన్న శివాలయాన్ని పరిశీలించారు. ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా.. ప్రస్తుతం గర్భగుడి మాత్రమే మిగిలి ఉంది. గర్భాలయానికి చెందిన ద్వారపాలక స్తంభాలు సైతం కూలిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఎడమవైపు ఉన్న స్తంభంపై ఒక శాసనాన్ని గుర్తించారు. దాని ప్రతిని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపించారు. కుడివైపు స్తంభంపైనా శాసనం ఉండవచ్చని భావించినప్పటికీ.. అది కిందపడిపోయి ఉండటంతో పాటు దానిపై మరికొన్ని స్తంభాలు ఉండటంతో అప్పట్లో పరిశీలించలేకపోయారు.
తాజాగా కొండవీడు అభివృద్ధి కమిటీ సభ్యులు మరోసారి రుద్ర పాద శిఖరానికి చేరుకున్నారు. కుడివైపు ద్వారపాలక స్తంభాన్ని గుర్తించి.. దానిపై ఉన్న రాళ్లను తొలగించి పరిశీలించారు. ఈ క్రమంలో స్తంభంపై మరో శాసనం ఉన్నట్లు గుర్తించారు. దాని ప్రతిని తీసి అధ్యయనం కోసం పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపించినట్లు కమిటీ కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. ఈ శాసనంలో మొత్తం 12 లైన్లు ఉన్నాయని చెప్పారు. తాపనాచార్యులకు దానంగా కొంత పొలం ఇచ్చినట్లు శాసన సారాంశం తెలియజేస్తోందని వివరించారు. శివాలయ నిర్మాణ శైలిని పరిశీలించినప్పుడు అది 14, 15వ శతాబ్దాల కాలం నాటిదిగా గుర్తించినట్లు తెలిపారు. అయితే శాసనానికి సంబంధించిన పూర్తి వివరాలు, కాల నిర్ధారణ, చారిత్రక ప్రాధాన్యతపై పురావస్తు శాఖ అధ్యయనం చేయాల్సి ఉంది.
కొండవీడు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నాలుగు శాసనాలను వెలుగులోకి తీసుకువచ్చినట్లు శివారెడ్డి తెలిపారు. వీటిలో రెండు శాసనాలు పెదకోమటి వేమారెడ్డి కాలం నాటివిగా తేల్చినట్లు చెప్పారు. మరో రెండు శాసనాలు రుద్ర పాద శిఖరంపై ఉన్న శివాలయం ద్వారపాలక స్తంభాలపై గుర్తించినవని వివరించారు. ఒక శాసనాన్ని జూన్‌లో గుర్తించగా.. తాజాగా మరో శాసనం వెలుగులోకి వచ్చింది. కొండవీడు మొత్తం 42 కొండల సమాహారమని కొండవీడు కైఫియత్ పేర్కొంటుందని శివారెడ్డి తెలిపారు. రుద్ర పాద శిఖరం సమీపంలో బొల్లుమోర వెంకటేశ్వరస్వామి బోడు ఉందని.. దానిపై వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఉందని చెప్పారు. చారిత్రక ఆధారాల ప్రకారం పెదకోమటి వేమారెడ్డి ఈ ఆలయానికి విరివిగా దానాలు చేసినట్లు తెలుస్తోందని వివరించారు. ఈ ప్రాంతంలోనూ సమగ్రంగా పరిశీలన జరిపితే మరిన్ని శాసనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు. కొండవీడులోని చారిత్రక సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. శిథిలాలను, శాసనాలను పరిరక్షించేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.