Kolleru Wildlife Sanctuary: ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా, వలస పక్షులతో పర్యాటకులను అలరిస్తూ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న కొల్లేరు ప్రాంత అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొల్లేరు అభయారణ్యంతో పాటు పరివాహక ప్రాంతాల పరిరక్షణకై ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుల నిర్ధారణ ప్రతిపాదనలకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. సరిహద్దుల నిర్ధారణ కోసం సమగ్రమైన ప్రతిపాధనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతాన్ని, నిర్థారణ పనులను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, అటవీ, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, ట్రాన్స్కో, రెవిన్యూ, పంచాయతీ, మత్స్య శాఖ, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, భూగర్భ జలాలు, మునిసిపల్, పర్యావరణ, పరిశ్రమలు, సర్వే, స్వచ్చంద సంస్థలతో కమిటీ ఏర్పాటు చేశారు. కొల్లేరు ప్రాంతంలో వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం కొల్లేరు ప్లస్ కాంటూర్ కి పైన 10 కిలోమీటర్ల పరిధి వరకు ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దులు నిర్దారణ చేయనున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటుచేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ కొన్ని కార్యకలాపాలను నియంత్రించడం ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుల ప్రాథమిక లక్ష్యం. తద్వారా రక్షిత ప్రాంతాన్ని ఆవరించి ఉన్న పర్యావరణ వ్యవస్ధ కార్యకలాపాల ప్రతికూల పరిస్థితులను తగ్గించనున్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ నిర్ధారణలో వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షించనుంది. అలాగే కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ను తయారుచేసి, సంబంధిత గ్రామాల ప్రజలకు దానివల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియజేస్తారు.
గ్రామ సభలలో వచ్చే సూచనలు, అభ్యంతరాలను తప్పనిసరిగా నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నివేదిక అందిస్తారు. అలాగే కొల్లేరు కాలుష్యానికి ముఖ్య కారణమైన విజయవాడ నుండి వచ్చే బుడమేరు వ్యర్ధాలు కొల్లేరులో కలవకుండా, తగిన చర్యలు చేపట్టేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..