Punganur: ఏపీ రాజకీయ తెరపై రామచంద్ర యాదవ్‌.. సడెన్‌గా వచ్చి కలకలం రేపుతున్న వైనం

|

Aug 03, 2023 | 8:41 PM

పదేళ్ల క్రితం పక్కింటోళ్లకు కూడా పెద్దగా తెలియని పేరు. ఇప్పుడు స్టేట్‌ మొత్తంలో వినిపిస్తున్న పేరు. అదే రామచంద్ర యాదవ్‌. చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈయనపై చర్చ జరుగుతోంది. అసలు ఎవరీ రామచంద్ర యాదవ్‌. ఆయన లక్ష్యం ఏంటి? ఇంతకీ ఎవరు వదిలిన రాజకీయ రామ బాణం ఇది! పదే, పదే కేంద్ర పెద్దలను ఎందుకు కలుస్తున్నారు..? సాక్షాత్తూ అమిత్ షా ఎందుకు అడ్డగానే ఈయనకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు.. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Punganur: ఏపీ రాజకీయ తెరపై రామచంద్ర యాదవ్‌.. సడెన్‌గా వచ్చి కలకలం రేపుతున్న వైనం
Ramachandra Yadav
Follow us on

చిత్తూరు జిల్లా, ఆగస్టు 2:  పదేళ్ల క్రితం ఆయనకు పెద్దగా నేము ఫేము లేదు. ఓ మధ్యతరగతి కుటుంబరావు. సామాన్యంగా బతికే కామన్‌మేన్‌. సీన్ కట్‌ చేస్తే 2019లో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. అందరి కంట్లో పడ్డారు. అందరి నోళ్లలో నానారు. తాజాగా భారీ సభ పెట్టి భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావాన్ని అట్టహాసంగా ప్రకటించారు. ఆయనే రామచంద్ర యాదవ్‌. అసలు ఎవరీ రామచంద్ర యాదవ్‌. ఆయన లక్ష్యం ఏంటి? రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉండగా ఆయన బీసీవై అనే పార్టీ ఎందుకు పెట్టారు? గల్లీలో పెద్దగా పేరు ప్రతిష్టలు లేకపోయినా ఢిల్లీ లెవెల్లో మాత్రం చక్రం తిప్పుతారట ఈ రామచంద్రుడు. ఈయన తమిళనాడు శశికళకు బినామీ అని, పెద్ద లాబీయిస్టు అని రకరకాల పుకార్లు జనంలో షికార్లు చేస్తూ ఉంటాయి. వాటిలో వాస్తవమెంతో ఎవరికీ తెలియదు. అసలు ఈయన ఏ వ్యాపారాలు చేస్తారో, ఈయనకు ఏయే కంపెనీలు ఉన్నాయో…వాటి అడ్రస్సులు ఎక్కడో ఎవ్వరికి, ఎప్పటికీ తెలియవని చెప్పుకుంటుంటారు. ఈ రామచంద్ర రహస్యం ఏంటో అంతు పట్టక రాజకీయ పార్టీలు కూడా జుట్టు పీక్కుంటున్నాయిట. అంతులేని మిస్టరీగా మిగిలిన ఈయన ఎదుగుదల రహస్యం ఎవరికీ అంతుబట్టడం లేదట.

ఒకప్పుడు అతి సామాన్యంగా బతికిన రామచంద్ర యాదవ్‌…ఇప్పుడు పుంగనూరులో కట్టుకున్న తన గృహ ప్రవేశాన్ని 30 రోజుల పాటు ధూంధాంగా జరిపి అందరిని అవాక్కయ్యేలా చేశారు. ఈ ప్యాలెస్‌ ప్రారంభోత్సవానికి యోగా గురు రాందేవ్‌ బాబా కూడా హాజరయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నట్టు పొలిటికల్ ఫైట్ మారింది. వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దాయనగా పేరున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఢీ అంటే ఢీ అంటున్నాడు. రాజకీయ ఉద్దండుడు పెద్దిరెడ్డితోనే ఫైట్‌కు రెడీ అంటున్నాడు.

అనూహ్యంగా ఏపీ పొలిటికల్ స్క్రీన్‌పై ఊడిపడ్డ రామచంద్ర యాదవ్ బ్యాక్‌గ్రౌండ్‌పై ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చ రచ్చ జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దపంజాణి మండలం దాసర్ల పల్లె ఆయన సొంత ఊరు. ఉద్యోగాలు వ్యాపారాలతో ఎలాగోలా ఎదిగాడు. నేము ఫేము వచ్చాక రాజకీయ బాట పట్టాడు. 2018 నుంచి సేవా కార్యక్రమాలు ప్రారంభించిన రామచంద్ర…ఆ తర్వాత నెక్ట్స్‌ లెవెల్‌ అయిన రాజకీయాల్లో కాలు పెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పుంగనూరు నుంచి బరిలో దిగిన రామచంద్ర యాదవ్ మంత్రి పెద్దిరెడ్డిని ఢీకొన్నారు. 16 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలైనా మంత్రి రామచంద్రారెడ్డితో వైరాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. మంత్రికి పోటీగా పుంగనూరులో పలు కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. నేను లోకల్ అంటున్న రామచంద్ర…ఈమధ్య కాలంలో మరింత దూకుడు పెంచారు.

గత ఏడాది సెప్టెంబర్ లో ఏకంగా పుంగనూరులో 170 కంపెనీలను ఆహ్వానించి 12 వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంతో పెద్ద వివాదమే నడిచింది. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో మేళా ఆగిపోయింది. తిరిగి డిసెంబర్ లో రైతుభేరి పేరుతో మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసిన రామచంద్ర యాదవ్ ఏకంగా ఆయన సొంత మండలం సదుంలో కార్యక్రమానికి పిలుపునిచ్చి ఉద్రిక్త పరిస్థితులకు రణం అయ్యారు. సదుంకు వెళ్లకుండా రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకోవడం, అదే రోజు వైసీపీ కార్యకర్తలు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేయడం సంచలనం రేపింది.

ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ తన రాజకీయ కార్యకలాపాలను ఢిల్లీకి మార్చారు రామచంద్ర యాదవ్‌. పెద్దిరెడ్డిపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసిన రామచంద్ర యాదవ్ ఏకంగా తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసి Y+ కేటగిరి సెక్యూరిటీని సాధించుకోగలిగారు. ఈ ఏడాది జనవరి నుంచి వైప్లస్ భద్రత తో మంత్రి పెద్దిరెడ్డిని ఢీకొడుతున్న రామచంద్ర యాదవ్ పుంగనూరులో దూకుడును ప్రదర్శించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు. పుంగనూరు ప్రాంతంలో చేపట్టిన మూడు ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన రామచంద్ర యాదవ్ వాటి పరిశీలనకు వెళ్లడం కూడా వివాదాస్పదంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించేందుకు ఏకంగా హెలికాప్టర్ సర్వే చేసి రామచంద్ర యాదవ్..పబ్లిక్‌లో హాట్ టాపిక్‌గా మారారు.

ఏపీ రాజకీయాల్లో రామచంద్ర యాదవ్‌ అనే ఈ రామబాణాన్ని ఎవరు సంధించారో తెలియకపోయినా… మంత్రి పెద్దిరెడ్డి ఏకైక లక్ష్యంగా ఆయన పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. ఆయనపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా తన పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెలలో భారత చైతన్య యువజన పార్టీ పెట్టి… ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న పెద్దిరెడ్డిని ముప్పతిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి పెద్దిరెడ్డిని ఓడించకపోతే పుంగనూరు ప్యాలెస్‌ వదిలేసి వెళ్లిపోతానంటూ ఈయన ఛాలెంజ్‌ కూడా చేశాడని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఈ బీసీవై వ్యూహం ఏంటో, రామచంద్ర యాదవ్‌ రాజకీయమేంటో పూర్తిగా తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్‌ అండ్‌ వాచ్‌ అంటున్నారు విశ్లేషకులు.

—-టీవీ9 తెలుగు డెస్క్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.