విజయనగరం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యాపారిని మరికొందరు వ్యాపారులు కిడ్నాప్ చేసి నరకం చూపించారు. కర్రలతో దారుణంగా కొట్టారు. బూటు కాలితో ఇష్టమొచ్చినట్టు తన్నారు. అంతటితో ఆగకుండా మూత్రం తాగించి అనాగరికంగా వ్యవహరించారు. ఇప్పుడీ ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపుతోంది.
వ్యాపారి భగవాన్ రామ్ రెండేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి విజయనగరానికి వచ్చి హోమ్ నీడ్స్ ఐటమ్స్ బిజినెస్ చేస్తున్నాడు. భగవాన్ రాంకు రాజస్థాన్ కి చెందిన వ్యాపారి బిజిలారాంతో పరిచయం ఉంది. బిజీలా రాం బెంగుళూరులో బిజినెస్ చేస్తున్నాడు. జూన్ 13వ తేదీన బిజిలా రాం, భగవాన్ రాం కు ఫోన్ చేసి, తాను బిజినెస్ పని మీద వైజాగ్ వస్తున్నానని, అక్కడ నుండి విజయనగరానికి వచ్చి కలుస్తానని చెప్పాడు. ఈ నెల 14 న బిజిలారాం తన స్నేహితుడు దిలీప్ తో కలిసి విజయనగరంలో భగవాన్ రాంను మీట్ అయ్యారు. దాబాకు తీసుకెళ్లి లిక్కర్ తాగించారు. ప్రీ ప్లాన్డ్‌గా అప్పటికే మరో ముగ్గురు అక్కడ కాపు కాచారు. అందరూ కలిసి భగవాన్ రాంను బలవంతంగా కారులో ఎక్కించారు. కర్రలతో చికక్కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ.. విచక్షణ రహితంగా దాడి చేశారు.
మార్గమధ్యలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలో బిజిలారాం మరో స్నేహితుడు వాజీరాం కూడా వారితో కలిశాడు. ఆరుగురు కలిసి భగవాన్ రామ్ ని చిత్రహింసలు పెట్టారు. అంతటితో ఆగని ఆ కిరాతకులు.. భగవాన్ రామ్ తో బలవంతంగా మూత్రం తాగించారు. వద్దని వేడుకున్నా.. కాళ్లావేళ్లా పడ్డా వినలేదు. ఇదంతా మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఆ వీడియోను రాజస్థాన్, బెంగళూరులోని వారి ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న భగవాన్ రాం స్నేహితులు.. రాజీ కదిర్చారు. అందుకోసం రూ. 35వేలు తీసుకుని భగవాన్ రాంను వదిలేసి వెళ్లిపోయారు కిడ్నాపర్లు.
బాధితుడి ఫిర్యాదుతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు..విజయవాడలోని వాజీరాం అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం వెతుకుతున్నారు. అయితే, ఓ మహిళకు అసభ్యకరమైన వాట్సాప్ మేసేజ్ లు చేయడం వల్లే వివాదం మొదలైంది పోలీసులు చెప్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..