Andhra Pradesh: తొక్కిసలాట ఘటన.. మృతులకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా.. అండగా ఉంటామన్న లోకేశ్..
కాశీబుగ్గలోని తొక్కిసలాట ఘటనాస్థలాన్ని మంత్రి లోకేశ్ పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఆలయాన్ని 94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో నిర్మించారని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో చోటు చేసుకున్న పెను విషాదం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా.. పలువురిగి గాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని మంత్రి లోకేశ్ పరిశీలించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. 94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారని.. ఇంత మంది భక్తులు వస్తారని ఊహించలేదన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని తెలిపారు.
ఎలా జరిగిందంటే..?
గర్భగుడి మొదటి అంతస్థులో ఉండటంతో 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లాలి. భక్తుల సంఖ్య పెరగడం వల్ల మెట్లపై రెయిలింగ్ ఊడి పడింది. రెయిలింగ్ తమపై పడుతుందేమోనన్న భయంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతిచెందారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారికి పలాస, టెక్కలి ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. మృతులను టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మ, పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ , వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ, మందసకు చెందిన రాజేశ్వరి, బృందావతి . నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ , సోంపేటకు చెందిన నిఖిల్ , పలాసకు చెందిన అమ్ములుగా గుర్తించారు.
కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌పండా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తారని శనివారం అంతకు మించి రావడంతోనే దుర్ఘటన చోటు చేసుకుందన్నారు పండా. ఇంత మంది వస్తారని ఊహించి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేవాడినన్నారు. దర్శనానికి వెళ్లి వచ్చే క్యూలైన్ ఒకటే ఉండటం. 25వేల మంది భక్తులు ఆలయానికి రావడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. భక్తులు భారీ సంఖ్యలో వచ్చినా నిర్మాణ పనులు ఆపకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. నిర్మాణాలు ఆపేసి.. ఎంట్రీ, ఎగ్జిట్‌కు వేర్వేరు క్యూలైన్ కేటాయిస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
