ఆర్టీసీ బస్సులో దారుణం.. సీటు ఇవ్వలేదని కర్రలు, రాడ్లతో మహిళలపై దాడి..!
ఆర్టీసీ బస్సులో సీటు వివాదం యువకుల దారుణ దాడికి దారితీసింది. కాకినాడ జిల్లా చిన్నంపేట వద్ద బస్సులో మహిళలపై కర్రలు, రాడ్లతో 30 మంది యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు: ఏలేశ్వరం మండలం చిన్నంపేట వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. శనివారం, అక్టోబర్ 18 రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తుని నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో రాజమండ్రికి చెందిన మహిళలతో సిరిపురం గ్రామానికి చెందిన మహిళకు గొడవ జరిగింది. తనను కొట్టారంటూ సదరు మహిళ భర్తకు ఫోన్ చేసి చెప్పింది.
దీంతో ఆగ్రహానికి గురైన భర్త, సిరిపురం గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులతో కలిసి చిన్నంపేట జాతీయ రహదారిపై బస్సు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. బస్సు అక్కడికి చేరుకోగానే కర్రలు, ఇనుప రాడ్లతో మహిళలపై గొడవకు దిగిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దాడిలో రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
దాడితో భయాందోళనలకు గురైన బాధితులు 112 పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే, ఏలేశ్వరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే సదరు మహిళ, ఆమె భర్త అక్కడి నుంచి పారిపోయారు. బాధితులు, బస్సు డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో కొందరు మద్యం, గంజాయి సేవించి ఉన్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
