‘దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు’ కాకినాడ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ టి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రోజులు గడిచేకొద్దీ కీలక మలుపులు తిరుగుతోంది. కుటుంబాన్ని వేధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్‌ఖాన్‌ను పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, నూకరాజు రాసిన వీలునామా, కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్స్‌, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు..

దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు కాకినాడ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు
AE Nookaraju family Death Updates

Updated on: Aug 21, 2026 | 7:04 AM

కాకినాడ, ఆగస్ట్‌ 21: కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన నూకరాజు.. సుమారు రెండు నెలల క్రితమే సాధిక్‌ఖాన్‌ ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని ఇకపై వేధించవద్దని వేడుకున్నట్లు సమాచారం. ‘ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది.. ఇకపై మా కుటుంబాన్ని వేధించడం ఆపేయండి’ అని కోరినట్లు తెలుస్తోంది. సాధిక్‌ వల్ల తమ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయిందని, తమ ఇంటివైపు రావద్దని అతడికి చెప్పాలని సాధిక్‌ తల్లినీ నూకరాజు బతిమాలినట్లు సమాచారం. ఆమె కూడా కుమారుడికి హితవు పలికినప్పటికీ సాధిక్‌ మాత్రం ఆమె మాటలను పట్టించుకోలేదు.

సాధిక్‌ కుటుంబ సభ్యుల విచారణ

నూకరాజు కుటుంబం ఆత్మహత్య అనంతరం సాధిక్‌ఖాన్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాధిక్‌ ఎక్కడికి వెళ్లి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి ఆచూకీ తెలిపితే రివార్డు ఇస్తామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కూడా చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందే నూకరాజు వీలునామా రాసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తనకు ఉన్న స్థిర, చరాస్తులను ముగ్గురి పేరున రాసిపెట్టినట్లు సమాచారం. ఇందులో నూకరాజు సోదరితో పాటు మరో ఇద్దరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మనవడు కార్తికేయ కూడా తమతోపాటే చనిపోతాడని భావించడంతో అతడి పేరును వీలునామాలో చేర్చలేదు. ఈ అంశంపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గత రెండు నెలల్లో సాధిక్‌ఖాన్‌ ఫోన్‌కాల్‌ జాబితాలో ఉన్న వ్యక్తులకు పోలీసులు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నారు. సాధిక్‌తో వారికి ఉన్న సంబంధం, అతడితో జరిగిన సంభాషణలు, కుటుంబంపై వేధింపులకు సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది. అదేవిధంగా నూకరాజు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. ఆర్థిక లావాదేవీలకు ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

‘ఈత వచ్చు.. బతికి బయటపడితే ఆంటీ వద్దకు వెళ్లు’

నదిలో దూకడానికి ముందు సౌజన్య తన కుమారుడు కార్తికేయతో మాట్లాడినట్లు సమాచారం. ‘నీకు ఈత వచ్చు.. బతికి బయటపడితే ఫలానా ఆంటీ వద్దకు వెళ్లు’ అని తల్లి సౌజన్య చెప్పినట్లు కార్తికేయ పోలీసులకు తెలిపాడు. కార్తికేయ చెప్పిన ఆ మహిళ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఫోన్‌ పనిచేయకపోవడంతో ఆమెను సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గురువారం గాలింపులో గోదావరిలో సౌజన్య మృతదేహం లభ్యమైంది. ఆమె తల్లి మృతదేహం కోసం రెస్క్యూ టీం ఇంకా గాలింపు కొనసాగిస్తుంది. ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సాధిక్‌ఖాన్‌ పాత్ర, ఘటనకు ముందు జరిగిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us