5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు చిన్న క్లూతో సాదిక్‌ అరెస్ట్‌!

కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు సాదిక్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదు రోజులుగా నాలుగు రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన అతడిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ చిన్న క్లూతో పోలీసులు పట్టుకున్నారు. ఫోన్‌, డిజిటల్‌ లావాదేవీలకు దూరంగా ఉంటూ తప్పించుకున్న సాదిక్‌ఖాన్‌ను మరికొన్ని గంటల్లో రాజమహేంద్రవరానికి తీసుకురానున్నారు. విచారణలో నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది..

5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు చిన్న క్లూతో సాదిక్‌ అరెస్ట్‌!
Kakinada AE Nukaraju Family Death Case

Updated on: Aug 23, 2026 | 8:04 PM

కాకినాడ, ఆగస్ట్‌ 23: కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రైఫిల్‌ షూటింగ్‌ ట్రైనర్‌ సాదిక్‌ఖాన్‌ను పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్‌ చేశారు. గత ఐదు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అతడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సాదిక్‌ఖాన్‌ ఫోన్‌ వినియోగం, డిజిటల్‌ లావాదేవీలకు దూరంగా ఉంటూ నాలుగు రాష్ట్రాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే దర్యాప్తులో లభించిన ఓ చిన్న క్లూతో అతడి ఆచూకీని గుర్తించి మీరట్‌లో పట్టుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్‌ అనంతరం సాదిక్‌ఖాన్‌ను రాజమహేంద్రవరానికి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

మరికొన్ని గంటల్లో రాజమహేంద్రవరానికి.. చివర్లో ట్విస్ట్

సాదిక్‌ఖాన్‌ను ఇవాళ రాత్రికి రాజమహేంద్రవరానికి తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని విచారించి కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టే అవకాశం ఉంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సాదిక్‌ఖాన్‌తో వారికి ఉన్న సంబంధాలు, అతడిపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఈ నెల 16న ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముగ్గురి మృతదేహాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.

నూకరాజు కుటుంబ సభ్యులు సాదిక్‌ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అతడి వేధింపులు, టార్చర్‌ కారణంగానే నూకరాజు తన భార్య, కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సాదిక్‌ఖాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నూకరాజు సోదరుడు మాట్లాడుతూ.. ఎంతో ధైర్యంగా ఉండే తమ సోదరుడు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సాదిక్‌ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. నూకరాజు మేనకోడలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు. సౌజన్య భర్త మృతి కేసులోనూ సాదిక్‌ఖాన్‌పై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం

సాదిక్‌ఖాన్‌ అరెస్ట్‌తో ఈ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడినట్లయింది. అతడిని పోలీసులు విచారించిన తర్వాత నూకరాజు కుటుంబంతో అతడికి ఉన్న సంబంధాలు, కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాదిక్‌ఖాన్‌ కారణమన్న ఆరోపణలు ప్రస్తుతం కుటుంబ సభ్యులు చేస్తున్నవే. దర్యాప్తు, సాక్ష్యాధారాలు, పోలీసుల విచారణ అనంతరం ఈ కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us