Ananthapur: అనంత జిల్లా మొత్తం మాదే అంటున్న జేసీ బ్రదర్స్.. మరీ వారి దూకుడుకు టీడీపీ అధినేత వైఖరేంటి..?

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Mar 28, 2022 | 4:25 PM

ఒక్కొక్క నియోజకవర్గంలో పాగా వేసేందుకు బాహుబలి స్టైల్ పావులు కదుపుతున్నారు జేసీ బ్రదర్స్. ప్రతి నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉండేవారిని దింపేందుకు రెండేళ్ల ముందు నుంచే ప్లాన్స్ వేస్తున్నారు.

Ananthapur: అనంత జిల్లా మొత్తం మాదే అంటున్న జేసీ బ్రదర్స్.. మరీ వారి దూకుడుకు టీడీపీ అధినేత వైఖరేంటి..?
Jc Brothers

Ananthapur District Politics: మా రేంజ్.. ఒక్క నియోజకవర్గం కాదు.. ఒక పార్లమెంట్ కాదు.. జిల్లా మొత్తం శాసిస్తాం.. ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలి.. ఎందుకు ఇవ్వాలి.. మేమే డిసైడ్ చేస్తాం.. ఇదీ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) అభిప్రాయమా.. అంటే అనంత తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో ఇదే నిజం అంటూ చర్చ నడుస్తోంది. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో పాగా వేసేందుకు బాహుబలి స్టైల్ పావులు కదుపుతున్నారు జేసీ బ్రదర్స్. ప్రతి నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉండేవారిని దింపేందుకు రెండేళ్ల ముందు నుంచే ప్లాన్స్ వేస్తున్నారు. తాము చేయాలనుకున్నది.. చెప్పాలనుకున్నది సూటీగా, స్పష్టంగా చెబుతున్నారు.. ఇలా అన్ని నియోజకవర్గాలపై ఫోకస్ చేయమని అధిష్టానం చెప్పిందా..? అసలు అనంత టీడీపీలో ఏం జరుగుతోంది…?

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందే అనంతలో రాజకీయాలు రగులుతున్నాయి.. అధికార పార్టీలో ప్రస్తుతం మంత్రి ఎవరన్నది డిస్కషన్ పీక్‌లో ఉంటే.. ప్రతిపక్షమైన టీడీపీలో 2024లో ఎవరు బరిలో ఉంటారన్నదానిపై పెద్ద లొల్లి జరుగుతోంది. అయితే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో గొడవలు ఉంటే.. అసలు జిల్లాను మొత్తం ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు. అసలు జేసీ బ్రదర్స్ వ్యూహామేంటి.. వారు ఏం చేయాలనుకుంటున్నారు.. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను మొత్తం గ్రిప్ లో పెట్టుకున్నారు.. జేసీ బ్రదర్స్. అందులోనూ జేసీ దివాకర్ రెడ్డి బాగా లీడ్ చేసే వారు. గతంలో అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీని పరిటాల రవి చక్రం తిప్పితే.. కాంగ్రెస్‌లో జేసీ దివాకర్ రెడ్డి ఆధిపత్యం చూపించే వారు. కానీ రాష్ట్ర విభజన తరువాత జేసీ బ్రదర్స్ అనుకోకుండా టీడీపీలోకి రావడంతో పరిస్థితి అంతా తలకిందులైంది. కాంగ్రెస్ తరహాలో 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేసీ బ్రదర్స్ గెలవడంతో ఇటు టీడీపీలో కూడా వారి గుప్పిట్లో వెళ్లింది.

అదే దూకుడుతో జేసీ బ్రదర్స్ జిల్లాను మొత్తం గ్రిప్ లో పెట్టుకోవాలని చూశారు. అందుకే అనంతపురం పార్లమెంట్‌లో కొన్ని నియోజకవర్గాలను తమ గ్రిప్ లోకి తీసుకోవాలనుకున్నారు. కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు దానిని బాగా అడ్డుకున్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో కూడా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్న దానిపై జేసీ బ్రదర్స్ ఓపెన్‌గా కామెంట్ చేశారు. కానీ అధిష్టానం వాటిలో కొన్ని పరిగణలోకి తీసుకుంది. మరికొన్ని రిజెక్ట్ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కుమారులిద్దరూ అటు పార్లమెంట్‌లో ఇటు తాడిపత్రిలో కూడా ఓటమి పాలు కావడంతో జేసీ బ్రదర్స్ సైలెంట్ అయ్యారు. ఇక పెద్దాయన జేసీ అయితే మొదట్లో కాస్త హడావుడి కనిపించినా.. దాదాపు ఏడాది కాలంగా ఆయన పూర్తి సైలెంట్‌గా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పలు కేసుల్లో జైలుకు వెళ్లడం.. వచ్చిన తరువాత తాడిపత్రి మున్సిపాల్టీలో మళ్లీ గెలవడంతో స్టేట్ మొత్తం మళ్లీ ఇటు వైపు చూసేలా చేశారు. దీనికి తోడు అధికార పార్టీని ఢీకొట్టి.. జైలుకు వెళ్లి, మళ్లీ ఎన్నికల్లో గెలవడంతో జిల్లా టీడీపీలో జేసీ ఫ్యామిలీపై సింపతీతో పాటు వీరు సరైన లీడర్స్ అన్న చర్చ జరిగింది….

ఇక్కడి వరకు బాగానే ఆ తరువాత నుంచి జేసీ వేసిన అడుగులు దారి తప్పాయి. ఆయన కేవలం తాడిపత్రికి పరిమితం కాకుండా పక్క నియోజకవర్గాల్లోకి ఎంటర్ అయ్యారు. సేవ్ టీడీపీ, సేవ్ కార్యకర్తల పేరుతో అన్ని నియోజకవర్గాల్లో యాత్రలు చేప్టటారు. దీనికి తోడు టీడీపీ రాయలసీమ స్థాయి సమావేశంలో కాల్వ శ్రీనివాసులపై నేరుగా కామెంట్స్ చేయడం పార్టీలో పెద్ద రచ్చకు దారి తీసింది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు జేసీ వెళ్లి పర్యటించడం.. ఇక్కడ నాయకులు సరిగా లేరు.. టికెట్లు వేరే వారికి ఇవ్వాలంటూ బహిరంగ కామెంట్స్ చేశారు.దీనికి టీడీపీ నేతలు వరుసబెట్టి జేసీ పై విమర్శలు చేశారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. నా నియోజకవర్గంలోకి వస్తే నేను నీ నియోజకవర్గంలో వస్తానంటూ తాడిపత్రి యాత్ర చేపట్టారు. దీంతో విషయం పీక్ స్టేజీకి పోయిందని గమనించిన అధిష్టానం ఎవరికి నియోజకవర్గాల్లో వారే ఉండాలని.. ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకూడదని ఒక హెచ్చరిక లాంటి నోట్ విడుదల చేసింది. ఆ తరువాత జేసీ సైలెంట్ అయ్యారు…

అయితే, తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ తన పని మొదలు పెట్టారు. సేవ్ టీడీపీ కార్యకర్తల పేరుతో పుట్టపర్తి నియోజకవర్గ పర్యటనలో కొండకమర్లకు జేసీ వెళ్లారు. అక్కడ జేసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. మాజీ మంత్రి పల్లెకు టికెట్ ఇవ్వకూడదని ఇస్తే పార్టీ ఓటమి కాయమని.. అదే సందర్భంలో చంద్రబాబు కూడా సీఎం కాలేడన్నారు. అంతే కాదు.. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చకపోతే.. పార్టీ గెలుపు కష్టమని జేసీ అన్నారు. దీనికి మాజీ మంత్రి పల్లె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒక్క సారి ఎమ్మెల్యేగా గెల్చిన నువ్వు చెప్పేదేంటి నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను.. మంత్రిగా చేశాను.. చీఫ్ విప్ గా చేశాను.. ముందు నీ నియోజకవర్గంలో చూసుకో అంటూ చరుకలంటించారు. అయితే జేసీ ఫ్యామిలీ జిల్లాను లీడ్ చేయాలని చూస్తోందని టీడీపీలో కొందరు అంటున్నారు. అందుకే పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు, రాయదుర్గం ఇంకా కొన్ని నియోజకవర్గాల మీద గ్రిప్ సాధించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు పెద్దాయని జేసీ దివాకర్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం జేసీ ఫ్యామిలీ మీద జిల్లా కంటే.. వారి కుమారులు పవన్, అస్మిత్ లను గెలిపించడమే ప్రధానమైన కార్తవ్యం. ఇలాంటి సమయంలో అన్ని నియోజకవర్గాల్లో తలదూర్చి.. పార్టీ దృష్టిలో, జిల్లాలో సీనియర్ నాయకుల దృష్టిలో చెడ్డ అవుతున్నారన్న టాక్ కూడా నడుస్తోంది…

రోజులు పాత కాలంలో లాగా లేవు.. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేసినట్టు.. ఇక్కడ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. గతంలోనే కొందరు తెలుగు దేశం పార్టీ నేతలు హెచ్చరించారు. మరి జేసీ తన పంతాన్ని, దూకుడును తగ్గించుకుంటారా.. లేక తగ్గేదే లే… జిల్లాను శాసిస్తామని అంటారా చూడాలి..

—- లక్ష్మీకాంత్ రెడ్డి, టీవీ 9 ప్రతినిధి, అనంతపూర్ జిల్లా.

Read Also…  CM YS Jagan: నేను లేకుంటే గౌతమ్‌ రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో.. నా ప్రతి అడుగులోనూ తోడున్నాడుః వైఎస్ జగన్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu