
ఏలూరు: బ్యాంకుల్లో దాచుకుంటేనే బంగారం భద్రం అనుకున్న నమ్మకం కాస్తా అభాసుపాలైంది. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన విలువైన బంగారు ఆభరణాలు మాయమవ్వడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఈ ఘోరం వెలుగుచూసింది. బ్యాంకులో ఉంచిన బంగారం మాయమైందనే సమాచారం కార్చిచ్చులా వ్యాపించడంతో, వందలాది మంది ఖాతాదారులు బ్యాంక్ ఎదుట బారులు తీరి తీవ్ర ఆందోళనకు దిగారు. తమ శ్రమకోర్చి కూడబెట్టుకున్న సొమ్ము ఏమైపోతుందోనన్న భయాందోళనలతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్క రోడ్డులో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గత కొన్ని రోజులుగా గోల్డ్ లోన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రాజు అనే ఉద్యోగి విధులకు రాకపోవడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. శనివారం నాడే ముగ్గురు ఖాతాదారులకు సంబంధించిన దాదాపు 30 కాసుల బంగారం మాయమైనట్లు ప్రాథమికంగా వెలుగుచూసింది. ఈ వార్త సోమవారం ఉదయానికి పట్టణమంతా పొక్కడంతో, తాకట్టు పెట్టిన మిగిలిన ఖాతాదారులు కూడా ఆందోళనతో బ్యాంకుకు పోటెత్తారు. తమ బంగారం సురక్షితంగా ఉందో లేదో చూపించాలంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జంగారెడ్డిగూడెం ఎస్సై వీరప్రసాద్ తన సిబ్బందితో రంగప్రవేశం చేశారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి, ఖాతాదారులను సమన్వయపరుస్తూ లోపలికి వెళ్లేందుకు వీలుగా టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు దాదాపు 80 మంది టోకెన్ల ఆధారంగా లోపలికి వెళ్లి పరిశీలించుకోగా, అనేకమంది ఖాతాల్లో బంగారం మాయమైనట్లు నిర్ధారణ అయింది.
బ్యాంకు సిబ్బంది చేతివాటం వల్లే ఈ ఘోరం జరిగిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. రాత్రి చాలా సమయం గడిచినా, బ్యాంకు ఎదుట టెంట్లు వేసుకుని కుర్చీల్లోనే కూర్చుని నిరసన కొనసాగించారు. బాధితులంతా తాము నష్టపోయిన బంగారం వివరాలతో బ్యాంకు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తమ బంగారాన్ని తమకు సురక్షితంగా అప్పగించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులోనే ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి