Janasena – Perni Nani: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించారు జనసేన నాయకుడు అనుకుల రమేష్. పార్టీ జెండా చేతపట్టుకొని కాన్వాయ్ మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అతడ్ని హుటాహుటీన పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పేర్ని నాని ఖబడ్దార్ అంటూ జనసైనికులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ అక్విడేట్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్నినాని పరిశీలించడానికి వచ్చారు.
జిల్లాలో ప్రాజెక్టులకు వచ్చిన వరదలు పరిశీలించే క్రమంలో యర్రకాలువ యనమదుర్రు డ్రయిన్ లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా నిడదోవోలు, తణుకు పరిసర ప్రాంత రైతులు వరదల వల్ల అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి అన్నారు. మాజీ సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 10, 12, వేల కెపాసిటీ ఉన్న జలాశయాన్ని 20 వేలకు పెంచారని మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్బంగా చెప్పారు. దువ్వలో కొత్త రెగ్యులేటర్ సమీప భవిష్యత్ లోనే ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని ఆదివారం ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మెలా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 800 థియేటర్లల్లో సినిమాలు ఆడుతున్నాయని పేర్ని నాని చెప్పారు. తెలంగాణలో 413 మాత్రమే నడుస్తున్నాయన్నారు. లవ్ స్టోరీ సినిమాకు ఏపీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నారు.
కేసీఆర్ ను తిట్టే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు లేదని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. సాయితేజ్ ప్రమాదం గురించి పోలీసులు చెప్పిందే మీడియా చెప్పిందని పేర్ని నాని తెలిపారు. దీనిపై పవన్ తెలంగాణ పోలీసులను ప్రశ్నించాలని సూచించారు. సిని పరిశ్రమకు ఏ విధంగా ఇబ్బంది పెట్టామో చెప్పాలని నాని తెలిపారు. సినీ నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తుందని నాని తెలిపారు. పవన్ కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారంటూ పేర్కొన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే కుదరదంటూ హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు పేర్ని నానిపై మండిపడుతున్నారు.