ఏపీలో అప్పుడే రాజుకున్న ఎన్నికల వేడి.. ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీల పోటాపోటీ ఫిర్యాదులు

|

Dec 18, 2023 | 12:32 PM

ఓ వైపు ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ఆరోపణలు..మరోవైపు ఈసీ అధికారుల పర్యటనలకు ఏర్పాట్లతో ఏపీలో ఎన్నికల జాతర మొదలైంది. ఈ సారి ఎన్నికలు ముందే రావొచ్చన్న వార్తలతో.. రాజకీయ పార్టీలు యాక్షన్‌ ప్లాన్‌ను స్టార్ట్‌ చేశాయి. అటు అధికారులు సైతం జిల్లాల వారీగా ఓటర్ల జాబితాలు, సున్నితమైన ప్రాంతాలు వంటి విషయాలపై ఇప్పటినుంచే సమాచారం సేకరిస్తున్నారు.

ఏపీలో అప్పుడే రాజుకున్న ఎన్నికల వేడి.. ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీల పోటాపోటీ ఫిర్యాదులు
Fake Votes
Follow us on

ఏపీలో ఎన్నికలకు వేళయింది. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం..ఏర్పాట్లు మొదలు పెట్టింది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఏపీకి రానున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్ల పై తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు చేసాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సైతం ఇరుపార్టీలు ఫిర్యాదు చేసాయి.

తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారనేది ఏపీలో ప్రధాన పార్టీల ఆరోపణ. దీంతో ఈ అంశంపై ప్రధానంగా దృష్టిపెట్టనుంది ఎన్నికల సంఘం. ఓటర్ల జాబితాపై ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ నెల 26 వ తేదీ వరకూ ఓటర్ జాబితా పరిశీలన జరగనుంది. ఆ తర్వాత జనవరి ఐదో తేదీన ఫైనల్ ఎస్ఎస్ఆర్ ను విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్.. ఈ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే సీఈసీ అధికారులు బృందం రాష్ట్రానికి వస్తుండటంతో ఎన్నికల హడావుడి ప్రారంభయింది.

అయితే నోటిఫికేషన్ రాకముందే ఏపీలో పొలిటికల్ రచ్చ మొదలయింది. ఓ వైపు దొంగఓట్లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం కూడా దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంలో జనసేన నేత నాగబాబుపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణలో ఓటు వేసిన నాగబాబు..ఏపీలో కూడా ఓటు కోసం ఎలా దరఖాస్తు చేసుకుంటారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. వైసీపీ ఆరోపణలపై స్పందించారు.. నాగబాబు స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతో తాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు.

సాధారణ ఎన్నికల షెడ్యూల్ 20 రోజులు ముందుగానే రావచ్చని సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఇప్పటికే రాజకీయంగా వాతావరణం హీటెక్కింది. ఇక ఈసీ టీమ్ కూడా రాష్ట్రానికి వస్తుండటంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. 2019లో ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 10న విడుదలైంది. ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సీఎం జగన్‌ చెప్పినట్లుగా 20 రోజుల ముందే షెడ్యూల్‌ వస్తే.. ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మార్చి మూడోవారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో షెడ్యూల్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రతినిధుల బృందం నుంచి ఏవైనా సంకేతాలు వస్తాయా అనే ఉత్కంఠ కూడా మొదలైంది. మొత్తానికి ఈసీ పర్యటనతో ఎన్నికల ప్రక్రియకు మొదటి అడుగు పడనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.