Pawan Kalayan: పద్మ పురస్కారాల ఎంపిక సవ్యంగానే జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన నేపథ్యంలో పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభా వంతులకే పద్మా అవార్డులు దక్కాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినీ సంగీత రంగంపై ఎస్పీ బాలు ముద్ర చెరగనిదని కొనియాడారు.
మరణానంతరం పురస్కారానికి ఎంపిక చేయడం ఆయన కీర్తిని మరింత పెంచిందన్నారు. ప్రముఖ గాయని చిత్రను ‘పద్మభూషణ్’కు ఎంపిక చేయడం సంతోషకరమని చెప్పారు. వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసురాలు సుమతి, అవధాన విద్యలో దిట్టగా నిలిచిన ఆశావాది ప్రకాశరావు, ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్న కనకరాజులను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేయడం కళలకు మరింత జీవం పోసినట్లయిందన్నారు. వీరందరికీ తనతో పాటు జనసేన తరఫున శుభాభినందనలు తెలియజేశారు.