ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఉభయగోదావరి జిలాల్లో పర్యటిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత మత్స్యకార గ్రామాల్లోని ఎటిమొగకు పడవలో వెళ్లి సందడి చేశారు. ఆ తర్వాత.. మత్స్యకారులతో సమావేశమైన ఆయన.. మరోసారి సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. కాకినాడ జిల్లా ఏటిమొగకు పడవలో వెళ్లారు పవన్ కల్యాణ్. మత్స్యకారులకు అభివాదం చేస్తూ బోటులో ముందుకు కదిలారు. మత్స్యకారుల ప్రాంతాలను పరిశీలించారు. మత్స్యకార బోట్లో ప్రయాణించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు స్థానిక జనసేన నాయకులు ఉన్నారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. బోటు పర్యటన తర్వాత మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం అయ్యారు. కాకినాడ స్మార్ట్ సిటీ కాదు.. మత్స్యకార గ్రామమైన ఎటిమొగను స్మార్ట్ సిటీగా చేస్తానన్నారు పవన్‌కళ్యాణ్. అందరూ అండగా ఉండాలని.. లేకుంటే పోరాటం చేస్తానే తప్ప అంతకు మించి ఏమీ చెయ్యలేనన్నారు.
మత్స్యకారుల్లోనూ ఎంతో మంచి స్విమ్మర్లు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే స్విమ్మింగ్ క్రీడలో రాణిస్తారని అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల జీవనశైలికి ఆక్వాస్పోర్ట్స్ దగ్గరగా ఉంటాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మత్స్యకార వృత్తిని వ్యవసాయంతో సమానంగా చూడాలన్నారు. సీఎం జగన్ లా అద్భుతాలు చేస్తానని చెప్పను గానీ.. మీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. మత్స్యకారుల వంటి ఉత్పత్తి కులాలకు ఇసుక వంటి సహజ ఖనిజాల కాంట్రాక్టులు ఇస్తే వారిలో ఆర్థిక అసమానతలు తొలగించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
మత్స్యకారులు సరైన నాయకులను ఎన్నుకోవాలని, మత్స్యకారులకు జనసేన అండగా ఉంటుందన్నారు పవన్ కల్యాణ్. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు తెలపాలని మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి జనసేన ప్రభుత్వం స్థాపించేందుకు అండగా ఉండండి.. ఈసారి ఎన్నికల్లో జనసేన ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని.. మీ కోసం మరింత బలంగా పనిచేస్తామని చెప్పారు పవన్‌కళ్యాణ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..