జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆయన గుంకలాం గ్రామానికి బయల్దేరారు. పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ గ్రామంలోని జగనన్న కాలనీని పరిశీలించనున్నారు. పవన్ వస్తున్న దారి పొడవునా అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు బారులు తీరారు. ఆనందపురం కూడలి వద్ద గజ మాలతో జనసేనానిని ఘనంగా సత్కరించారు. కాగా.. గుంకలాంలో 397 ఎకరాల్లో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్దది కావడం విశేషం. 2020 డిసెంబరు 30 న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కాలనీకి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దూరంగా ఉండటం, కనీస సౌకర్యాలు లేకపోవడం, నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, ప్రభుత్వం అందిస్తున్న సహాయం చాలకపోవడం వంటి కారణాలతో పనులు పూర్తవడం లేదు. ఈ నేపథ్యంలోనే నిర్మాణాల్లో జరుగుతున్న అలసత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పవన్ గుంకలాంలో పర్యటిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. విశాఖలో రాజకీయాలు రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి. రుషికొండను ధ్వంసం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం అదేమీ లేదని కొట్టి పారేస్తోంది. గతంలో ఉన్న రుషికొండ ఫొటోలను, ప్రస్తుత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు రుషికొండ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా రుషికొండ తవ్వకాలపై పలు ఆరోపణలు చేశారు. అక్రమ తవ్వకాలు బయటపడతాయనే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీతో భేటీ అయిన పవన్ రుషికొండ తవ్వకాలను పరిశీలించారు.
కాగా.. గతంలో పవన్ కల్యాణ్ చేపట్టిన విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. విశాఖ గర్జన అనంతరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారన్న ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం పవన్ కళ్యాణ్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయనను ముందుకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ కేసులో ఇద్దరు జనసేన నేతలు సుందరపు విజయ్ కుమార్, పి.వి.ఎస్.ఎన్. రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కేసులలో 25 మంది వరకు జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..