Jagan party completes ten years: తెలుగు రాజకీయాల్లో వైఎస్ అనే పేరే ఓ సంచలనం. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా.. ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా.. రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. 80వ దశకంలో యువ నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ అడుగడుగునా నిలదీశారు. సభలో వైఎస్ఆర్ ప్రసంగాలను చూసిన వారెప్పటికీ ఆయన్ను మరచిపోలేరు. అదే కోవలో కనిపిస్తారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన తండ్రి ఆకస్మిక మరణానంతరం సీఎం సీటును ఆశించి కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో భంగపడినప్పటికి వెన్ను చూపకుండా తనదైన శైలిలో సుమారు ఎనిమిదిన్నరేళ్ళ పాటు ప్రజలకు చేరువయ్యేందుకు శ్రమించి, ఆ తర్వాత తగిన ఫలమందున్నారు వైఎస్ జగన్. ఈ క్రమంలోనే ప్రత్యేక ప్రాంతీయ పార్టీ పెట్టి.. మార్చి 12వ తేదీకి పదేళ్ళు నిండుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ వయస్సు పదేళ్ళు నిండి పదకొండో ఏడు ప్రారంభమవుతుందన్నమాట.
తన తండ్రి పేరు స్ఫురించేలా యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ పేరిట పార్టీ పెట్టి మార్చి 12వ తేదీకి పదేళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా గ్రామ స్థాయి నుంచి మండలాలు, పట్టణాలు, నగరాల వరకు నిర్వహించేందుకు అధికార పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. అప్పటికి వైఎస్ జగన్ కడప ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం 2009 డిసెంబర్‌లో పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగగా దివంగత నేత సతీమణి వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత, ఆనాటి ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. అయితే తన తండ్రి స్థానంలో తాను ముఖ్యమంత్రి కావడానికి తనకు అన్ని అర్హతలున్నాయని బలంగా భావించిన వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీలో వుంటూనే సీఎం అయ్యేందుకు విపల యత్నం చేశారు. అయితే.. దివంగత నేత సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డికి ప్రాధాన్యతనిస్తూ.. జగన్‌ను పెద్దగా పట్టించుకోలేదు కాంగ్రెస్ అధిష్టానం. వివేకానందరెడ్డికి మంత్రి పదవినిచ్చి వైఎస్ఆర్ కుటుంబానికి పెద్దపీట వేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ భావించింది. దీంతో తన చిన్నాన్న వివేకానందతో జగన్‌కు ఓ దశలో దూరం పెరిగింది.
వైఎస్సార్ మృతిని తట్టుకోలేని అభిమానులు కొంతమంది గుండెపోటుతో మృతి చెందారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్ట దలిచారు వైఎస్ జగన్. అయితే ఈ యాత్రకు కాంగ్రెస్ అధినాయకత్వం అంగీకరించకపోవడంతో జగన్ పార్టీ పట్ల అసంతృప్తికి గురయ్యారు. తనకో, తన తల్లి విజయమ్మకో పార్టీ ప్రాధాన్యతిస్తుందనుకుని ఏడాదిపాటు కాంగ్రెస్ పార్టీలో వుంటూ ఎదురు చూసిన వైఎస్ జగన్ చివరికి 2010 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులకు కూడా రాజీనామా చేశారు. డిసెంబర్ 7, 2010న తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని, 45 రోజుల్లో పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే తన పార్టీ పేరును, ఇతర వివరాలను తూర్పు గోదావరి జిల్లా జగ్గన్నపేటలో వెల్లడించారు.
2011 మార్చి 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ఆనాటి నుంచి పార్టీకి తాను అధ్యక్షునిగాను, తన తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగాను వ్యవహరిస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత కడప లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిపై అయదు లక్షల 43 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సగర్వంగా లోక్‌సభలో అడుగుపెట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇదే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓదార్పు యాత్ర పేరిట విస్తృతంగా తిరిగారు జగన్. ఈ క్రమంలో 2014 ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న తరుణంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసి ప్రత్యేక తెలంగాణను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైసీపీ ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు నడిపింది. పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు జగన్. తాను స్వయంగా ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
తాను పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుంచి తన వద్దకు వచ్చేసిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలచే రాజీనామాలు చేయించారు జగన్. 2012లో జరిగిన 19 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు రాగా.. వైసీపీ 17 సీట్లలో ఘన విజయం సాధించింది. రెండు పార్లమెంటరీ స్థానాలకు కూడా గెలుచుకుంది. ఆ తర్వాతే జగన్ రాజకీయ పోరాటంలో ఇబ్బందులు ఎదురవడం మొదలైంది. తన తండ్రి సీఎంగా వున్నప్పుడు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న అభియోగం మీద ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. 2012 మే 27న జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. 16 నెలల పాటు హైదరాబాద్ చంచల్ గూడలో వున్నారు జగన్. 2013 సెప్టెంబర్ 2న జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో వైసీపీ 44.47 శాతం ఓట్లు సంపాదించినా.. కావాల్సిన మేజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా.. వైసీపీ 67 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. 9 ఎంపీ సీట్లను సాధించింది. దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించిన పార్టీగా వైసీపీకి పేరుగాంచింది. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ తగిన వ్యూహాల అమలు చేయడం ప్రారంభించారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు ఏపీలో పాదయాత్ర చేశారు. నవంబర్ 6, 2017న ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. జనవరి 9, 2019న ముగిసింది. 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్.
2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 స్థానాలు, 22 ఎంపీ స్ధానాలలో ఘన విజయం సాధించింది వైసీపీ. ఏపీలో మొత్తం పోలయిన ఓట్లలో 50 శాతం సాధించింది వైసీపీ. మే 30, 2019న ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వీకరించారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. 2019 నుంచి వైసీపీ ఏపీలో అధికార పార్టీగా కొనసాగుతోంది. విపక్ష తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లలో గెలుపొందగా.. అందులో 15 మంది దాకా వైసీపీ గూటికి చేరారు. దాంతో ప్రస్తుతం ఏపీలో తిరుగులేని పెద్ద పార్టీగా వైసీపీ ఎదిగింది. ఈ క్రమంలోనే భారీ ఎత్తున పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్దమవుతోంది.
ALSO READ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ ఓటు గల్లంతే..!
ALSO READ: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం.. ఓవైపు సైన్యం..మరోవైపు విపక్షం.. తప్పుకోవడం తప్పదేమో?
ALSO READ: దాడుల తర్వాత కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం.. సానుభూతి వర్కౌట్ అయ్యేనా?