నెల్లూరు, నవంబర్ 5: ఆటోబయోగ్రఫీ అంటేనే వివాదాదాలకు కేంద్రం. ఇటీవలికాలంలో కాంట్రవర్సీ కానీ ఆటోబయోగ్రఫీ లేదనే చెప్పాలి. తన గురించి తాను రాసుకునే ఆత్మకథలో తన ఎదుగుదలకు సహకరించిన వారి ప్రస్తావనతో పాటు ఆ వ్యక్తికి ఆటంకాలు సృష్టించిన వ్యక్తుల ప్రస్తావన లేకుండా ఉంటుందా.. అలాంటి అంశాలు బయటకు వచ్చాక అప్పటిదాకా ప్రపంచానికి తెలియని నిజాలు ఆత్మకథ ద్వారా వెలుగు చూస్తుంటాయి.. గతంలో అనేకమంది ప్రముఖులు రాసిన ఆత్మకతల్లో అనేక విషయాలు వివాదంగా మారాయి. తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ రాస్తున్న ఆత్మకథ విడుదలకు ముందే కాంట్రవర్సీగా మారింది. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత కీలక బాధ్యతల్లో ఉన్న సోమనాధ్ ను యావత్ ప్రపంచం తిలకించింది. గతంలో చంద్రయాన్ 2 వైఫల్యం.. చంద్రయాన్ 3 సక్సెస్ ప్రస్తావన వచ్చినపుడు సోమనాధ్ సారధ్యం.. విజయం అనే చర్చ జరిగింది.
అయితే సోమనాథ్ ‘నిలవు కుడిచ సింహంగల్’ వెన్నలను తాగిన సింహాలు పేరుతో ఆత్మకథను రాస్తున్నారు.. ఇది ప్రస్తుతం ప్రచురణ దశలోనే ఉంది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు మలయాళ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. అందులో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ శివన్ ప్రస్తావన ఉంది అన్నది ఆ వార్తల్లో ఉన్న సారాంశం. సోమనాధ్ కు పదోన్నతులు రాకుండా ఇస్రో మాజీ చైర్మన్ శివన్ అడ్డుకున్నారనే అర్ధం వచ్చేలా అందులో ఉంది. దీంతో సోమనాధ్ రాస్తున్న ఆత్మకథ పై వివాదం నెలకొంది. వివాదంపై మీడియా ముందు ఇస్రో చైర్మన్ సోమనాధ్ స్పందించారు. ఎవరైనా సంస్థలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అనేక సవాళ్ళను దాటల్సిందే అన్నారు. నాకు కూడా అలాంటి సవాళ్లే ఎదురయ్యాయి అన్నారు. ఒక కీలకమైన ఉన్నత పదవి కోసం అర్హులు ఎక్కువ మంది ఉండడం సహజం.. ఆ విషయాన్నే ప్రస్తావించాను తప్ప నేను ఎవరినీ టార్గెట్ చేయలేదు అన్నారు.
తనను ఇస్రో ఛైర్మన్‌గా శివన్ అడ్డుకున్నారని నేను చెప్పలేదు అన్నారు. ఇంకా ప్రచురణ దశలోనే ఉన్న ఆటోబయోగ్రఫీపై ఇలా వివాదం చేయడం బాధగా ఉందన్నారు.. అయితే అందులో చంద్రయాన్ 2 వైఫల్యం గురించి ప్రస్తావించినట్లు మాత్రం సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్ 2 ప్రయోగం జరిగింది శివన్ ఇస్రో చైర్మన్ గా ఉన్న సమయంలోనే.. ప్రధాని మోదీ స్వయంగా ల్యాండింగ్ ప్రక్రియ తిలకించేందుకు బెంగళూరు వచ్చారు కూడా.. ప్రయోగం వైఫల్యం అయ్యాక మోదీ శివన్ ను ఓదార్చడం అందరూ చూశారు. చంద్రయాన్ 2 వైఫల్యం ప్రస్తావన అందులో ఉందంటే దానికి కారణం శివన్ నిర్ణయాలే అన్న ప్రస్తావన ఉన్నట్లు వివాదం మరింత ముదిరింది. తాజా
వివాదం కారణంగా పుస్తక ప్రచురణను నిలిపి వేయలని నిర్ణయించా అని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.