Nallari Kiran Kumar Reddy: ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. ఇన్నాళ్లు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయకండువా కప్పుకోనున్నారు. తనకు, తన తండ్రికి రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీ చేతిని వీడి కాషాయకండువా కప్పుకోబోతున్నారు.. ఆరు నెలలుగా బీజేపీ అధిష్టానంతో జరుపుతున్నచర్చలు సఫలం కావడంతో మాజీ ముఖ్యమంత్రి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు బీజేపీకి ఏపీలో ఒక పెద్దతలకాయ అది కూడా నేషనల్ ఫిగర్ కోసం ఎదురు చూస్తున్న కాషాయనేతలకు కిరణ్ రూపంలో ఆశాకిరణం కనిపించింది. ఏపీలో వికసలించలేక వాడిపోతున్న కమలానికి నీళ్లుపోసి పూవులు పూయించే బాధ్యతను కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించబోతోంది బీజేపీ అధిష్టానం..
కిరణ్ ఎంట్రీకి డైరెక్టుగా అమిత్ షానే డీల్ చేశారా..?
ఒక బిగ్ లీడర్‌ను తమ పార్టీలోకి తీసుకురావడానికి.. రెండు తెలుగురాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి అమిత్ షా గత కొంతకాలంగా వ్యూహరచన చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగమే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లోకి ఎంట్రీ అని తెలుస్తోంది. ఆరునెలలుగా సంప్రదింపుల అనంతరం అమిత్ షాతో ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ అనంతరం కాషాయంలోకి ఎంట్రీకి నిర్ణయం తీసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో పని చేసి కిరణ్ కుమార్ రెడ్డిని ఆ స్థాయిలో గౌరవం, పదవి ఇచ్చి ఆయన సేవల్ని వినియోగించుకుంటామని బీజేపీ అధిష్టానం ఆయన్ను పార్టీ మారడానికి ఒప్పించింది..
ఏపీ,తెలంగాణ రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ఇన్నాళ్లు ముందుండి పార్టీని నడిపించే బలమైన నాయకుడిగా కోసం గాలిస్తోంది. అందులో భాగంగా భారీ వ్యూహంతోనే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది బీజేపీ. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజికవర్గంను పార్టీ వైపు మళ్లించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయాల్లో కీలకంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పట్టుంది.. అప్పటి కాంగ్రెస్ పార్టీలో చీఫ్ విప్ గా, అసెంబ్లీ స్పీకర్ గా, మూడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీపై అప్పట్లో పూర్తి స్థాయి పట్టు సాధించారు. రాష్ట్రవిభజన తర్వాత అనుకున్న వ్యూహాలు ఫలించక కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా చతికిలపడిన నేపథ్యంలో చాలామంది రెడ్డి నేతలు ఆ పార్టీని వీడారు. తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పట్టు అత్యధికం రెడ్డి సామాజికవర్గం నేతలే.. అటు ఏపీలో పార్టీలో ముఖ్యనేతలెవరూ లేకపోయినప్పటికీ వారంతా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు.ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల్లో చాలామంది నేతలు ఉన్నారు.
ఇటు తెలంగాణల,అటు ఏపీల్లో వివిధ పార్టీల్లో ఉన్న ఆ మాజీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డికి టచ్ లో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న రెడ్డి నేతలందర్నీ ఒక తాటిమీదికి తెచ్చి కమలాన్ని మరింత బలోపేతం చేయాలనేది బీజేపీ వ్యూహం. రాజకీయాల్లో విలువలున్న వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరుంది. అప్పట్లో రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి పదవినే వదులుకోవడం, ఆ తర్వాత ఏ పార్టీలో ఉన్నప్పటికీ..ఇతర నేతలని ఎక్కడా విమర్శించకపోవడం లాంటి అంశాలు ఆయనకు మరింత విలువని పెంచాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో కిరణ్ కుమార్ రెడ్డి అంటే మంచి గౌరవం ఇస్తారు రాజకీయనాయకులు. అందుకే ఆయనకున్న క్రెడిబిలిటీని పార్టీకి ఉపయోగించుకోవాలని బీజేపీ బావిస్తోంది. అందులోనూ రాయలసీమ డిక్లరేషన్ విషయంలో ఎప్పటి నుంచో బీజేపీ ప్రకటిస్తూ వస్తోంది. అందుకే రాయలసీమలో కాస్తో కూస్తో బీజేపీకి పట్టుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పట్టుని మరింత పెంచుకుని వాటిని ఓట్లు దిశగా మలుచుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ని వినియోగించనుంది బీజేపీ..రాయలసీమ రెడ్డినేతలను పార్టీకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మరికొన్ని నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ సారి ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన. అందులోనూ అమిత్ షా కూడా తెలంగాణపై విపరీతమైన దృష్టిపెట్టారు.ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలకు కిరణా్ కుమార్ రెడ్డిని రాజకీయ వ్యూహాలకు సిద్దాంతకర్తగా వినియోగించుకునే అవకాశం ముంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై, ప్రాజెక్టులపై,ఇక్కడి సమస్యలపై కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తి స్థాయి అవగాహన ఉంది. అయితే రాష్ట్రవిభజనను వ్యతిరేకించిన వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ ప్రజల ఆమోదం పెద్దగా లేకున్నా.. ఇక్కడి నేతల్లో ఇప్పటికీ ఆయనకు పట్టుంది. అందుకే తెరవెనుకే ఉండి పార్టీలోకి ముఖ్యనేతల్ని తీసుకురావడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడనికి కావాల్సిన వ్యూహాల్ని రచించడానికి కిరణ్ సేవలను వినియోగించనున్నట్టు తెలుస్తోంది
2014 రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేని కిరణ్ కుమార్ రెడ్డికి మళ్లీ పొలిటికల్ భవిష్యత్తుకు బీజేపీ ఎంట్రీ అనేది ఆయనకు లాభమే. చీఫ్ మినిస్టర్ స్థాయిలో పని చేసిన వ్యక్తి ప్రాంతీయ పార్టీల్లో కాకుండా అతిపెద్ద జాతీయ పార్టీలో చేరడం కచ్చితంగా ఆయనకు కలిసొచ్చే అంశమే.. తనకు రాజకీయభవిష్యత్తుని ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు కిరణ్ కుమార్ రెడ్డి..రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత తాను నమ్మిన సమైక్యాంధ్ర కోసం అదే పేరుతో రాజకీయపార్టీ పెట్టారు. లగడపాటి రాజగోపాల్,ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సాయిప్రతాప్ లాంటి కాంగ్రెస్ అగ్రనాయకుల సపోర్ట్ తో పార్టీ పెట్టినప్పటికీ ఎందుకో ప్రజలు పెద్దగా ఆ పార్టీని ఆమోదించలేదు.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి పదవినే..వదులుకున్నప్పటికీ.. ఏపీ ప్రజలు పెద్దగా సానుభూతి చూపించలేదు. కనీసం తాను నిలబెట్టిన అభ్యర్థులకు ఏపీలో కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆ పార్టీని ఎత్తేసి..మళ్లీ కాంగ్రెస్ లో చేరిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. రెండోసారి పార్టీలో చేరినప్పటికీ క్రియాశీలకంగా లేరు..పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. కనీసం రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు. అసలు ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారా..అసలు రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారా అనుకుంటున్న తరుణంలో ఇలా కాషాయంలోకి ఎంట్రీ ద్వారా మరో సంచలనానికి తెరతీశారు. బీజేపీలో ఆయన చేరడంతో ఆ పార్టికి నిజంగా ఎంత ఉపయోగం ఉంటుందో లేదో తెలీదు కానీ..రాజకీయంగా మళ్లీ జనాల్లోకి వెళ్లడానికి కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం ఇది లాభమేనని చెప్పొచ్చు.
-అశోక్ వేములపల్లి, అసోసియేట్ ఎడిటర్, టీవీ9