
నాటుసారా వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అధికారులు. నాటుసారా వ్యాపారాన్ని వదిలేసిన వారికి ప్రత్యామ్నాయ వ్యాపారానికి లక్షల్లో రుణాలను మంజూరు చేస్తున్నారు. సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచిస్తున్నారు. నాటుసారా నిర్మూలనకు నవోదయ 2.0 కార్యక్రమంను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా నాటుసారా తయారు చేసేవారిని, అమ్మే వారిని గుర్తించారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు. జిల్లాలో ఎక్కడా నాటుసారా తయారు చేయకుండా.. వ్యాపారం చేయకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ చర్యలు పూర్తి సఫలీకృతం కావడంతో జిల్లా పూర్తి స్తాయి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించారు జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం కలెక్టరేట్‌లో నవోదయ 2.0 కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాటుసారా రహిత జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాను ప్రకటించారు కలెక్టర్ నాగరాణి. నాటుసారా వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని గుర్తించామన్నారు కలెక్టర్. జిల్లాలో ఐదు గ్రామాల నుంచి నాటుసారా వ్యాపారాన్ని విడిచిపెట్టిన 13 మందిని గుర్తించారు అధికారులు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలకు 13 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి లక్ష చొప్పున 13 లక్షలు రుణాల చెక్కును లబ్ధిదారులకు అందించారు కలెక్టర్ నాగరాణి. నాటుసారాను వదిలినవారు వేరే ఉపాధి అవకాశాలను చూసుకుని గౌరవప్రదంగా జీవించాలన్నారు కలెక్టర్ నాగరాణి.