ఏటిఎం సెంటర్ల వద్ద అమాయక ప్రజలే టార్గెట్ గా స్మార్ట్ దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు బెజవాడ పోలీసులు. పెద్దగా ఆన్లైన్ పేమెంట్స్ పై అవగాహన లేని పబ్లిక్ నే టార్గెట్ చేసి బురిడీ కొట్టించి వారి వద్దే నగదు దొంగిలిస్తున్నరు ఈ కేటుగాళ్లు. విజయవాడ సిటీ వ్యాప్తంగా వివిధ ఏటిఎం సెంటర్ల వద్ద కాపు కాస్తు అక్కడికి వచ్చే అమాయకులని టార్గెట్ చేసి.. వారి దృష్టిని మళ్లించి, నగదు కాజేస్తున్నారు ఈ ఇద్దరు .
ఏటిఎం సెంటర్ల వద్దకు నగదు డ్రా చెయ్యటానికి వచ్చే వారికి మా ఎటిఎం కార్డు పనిచేయడం లేదని డబ్బులు చాలా అత్యవసరం అని నమ్మిస్తారు. నాలుగు కాకమ్మ కబుర్లు చెప్పి లిక్విడ్ క్యాష్ ఇస్తే phone pay/ paytm చేస్తాం అంటారు. spoof paytm అనే ఒక ఆండ్రాయిడ్ అప్ ద్వారా తప్పుడు ట్రాన్సక్షన్ స్టేట్మెంట్ సృష్టించి అది చూపించి వారి దగ్గర డబ్బు తీసుకుని ఆన్లైన్ లో పేమెంట్ చేశాం అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతారు.
ఈ విధంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో అమాయకులని టార్గెట్ చేసి సుమారు 40 ATM సెంటర్ల వద్దరూ. 5 లక్షల వరకు సొమ్ము కొట్టేశారు. దీనిపై వరుస ఫిర్యాదులు రావటంతో ఫోకస్ పెట్టిన సిటీ పోలీసులు ఇద్దరినీ ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దేవనపల్లి సాయి కళ్యాణ్, షేక్ చాంద్ పాషా లను రామవరప్పాడురింగ్ వద్ద అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి రూ.20,000/- నగదు రెండు స్మార్ట్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో మొత్తం 6 దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తించారు. కనుక తమకు తెలియని వ్యక్తుల పట్ల.. పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా ఏటీఎం సెంటర్ల వద్ద అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..