Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి..

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!
heavy rain allert to AP and Telangana

Updated on: Sep 02, 2025 | 4:33 PM

అమరావతి, సెప్టెంబర్‌ 2: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు.. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 48 గంటలలో ఒరిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం (సెప్టెంబర్‌ 2) ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇక బుధవారం (సెప్టెంబర్‌ 3) తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.