
Heatwave in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. రాష్ట్రంలో ఉష్ట్రోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నప్పటికీ.. మరికొన్ని చోట్ల ఎండలు మాత్రం తగ్గేదేలే అంటూ మాడు పగలగొడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ మంగళవారం తెలిపారు. రేపు 188 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 195 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 248 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
మంగళవారం ఏపీలో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 45°C, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44.9°C, కాకినాడ జిల్లా సీతంపేటలో 44.7°C, పల్నాడు జిల్లా రవిపాడులో 44.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. బాపట్ల-43, ఒంగోలు-43, నందిగామ-42, మచిలీపట్నం-42, కాకినాడ-42, అమరావతి-42, గన్నవరం-42, నెల్లూరు-42, నంద్యాల-41, తిరుపతి-41, నర్సాపురం-41, కడప-41, కర్నూలు-39, అనంతపురం-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 112 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండ తీవ్రతకు జనం ఇళ్ల నుంచి బయటికిరావడం లేదు. వ్యాపారులు షాపులు కూడా తెరవడం లేదు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతోపాటు అక్కడక్కడ ఈదురగాలులతో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..