Visakha – Grama Darshini: రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అది కూడా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో. గిరిజనుల వస్త్రాలు ధరించి.. గిరిజన పూజారి సమక్షంలో మనువాడారు. అదేంటి.. ఐఏఎస్ అధికారికి మళ్లీ పెళ్లి ఎంటి? గిరుజనుల పద్ధతిలో ఏంటి? అని అవాక్కయ్యారా..?! కాస్త ఆగండి మరీ. పైన ఫోటోలో కనిపిస్తున్నది ఎవరో కాదండోయ్.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే. పక్కనే ఉన్నది కూడా ఆయన సతీమణే..! సరదాగా జరిగిన తంతు ఇది.
వివరాల్లోకెళితే.. విశాఖ ఏజెన్సీ పర్యటనలో ఉన్న కాంతిలాల్ దండే.. పెదలబుడు లోని గిరి గ్రామదర్శిని సందర్శించారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా దండే దంపతులకు ఆహ్వానం పలికారు అక్కడి అధికారులు, గిరిజనులు. గిరిజన సాంప్రదాయ పరిరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఆయన ఫిదా అయ్యారు. అయితే అక్కడకు వచ్చే పర్యాటకులకు, గిరిజన సాంప్రదాయాలను వివరిస్తూనే.. ఔత్సాహికులకు గిరిజన సాంప్రదాయంలో వివాహ తంతును చేసి చూపిస్తారు. గిరిజన వధూవరుల కట్టు బొట్టుతో ముస్తాబు చేస్తారు. ఈ క్రమంలోనే కాంతిలాల్ దండే దంపతులకు కూడా సాంప్రదాయబద్ధంగా ముస్తాబు చేసి పెళ్లి తంతులో కూర్చోబెట్టారు. ఇదండీ ఈ పెళ్లి సంగతి..! ఇలా గిరి గ్రామదర్శిని సందర్శించి మంత్ర ముగ్ధులయ్యారు దండే దంపతులు. దండే తో పాటు ఐటిడిఎ పిఓ గోపాలకృష్ణ కూడా గిరి గ్రామదర్శిని సందర్శించారు. ఔత్సాహికులు ఎవరైనా గిరిజన సాంప్రదాయంలో వివాహం చేసుకోవాలనుకుంటే.. గిరి గ్రామదర్శిని సందర్శించవచ్చునని కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు.
Also read:
Kishan Reddy: ఒమిక్రాన్ వ్యాప్తి.. ఈశాన్య రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
AP Politics: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో స్మశాన రచ్చ.. తగ్గేదే లే అంటున్న కీలక నేతలు..
Telangana Cm Kcr: కేంద్రం చర్యల వెనుక భారీ కుట్ర.. నాగళ్లు ఎత్తాలంటూ రైతులకు సీఎం పిలుపు..!