MY FATHER CM: గత ముఖ్యమంత్రి వారసుల రాజకీయ జీవితం ఎలా ఉంది..?

|

Mar 21, 2024 | 9:54 PM

ఈ ఎన్నికలు కాస్త ప్రత్యేకమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రుల వారసులు అరడజను మంది పోటీ చేస్తున్నారు. వారిలో చాలామంది లెగసీని కంటిన్యూ చేయలేక రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉన్నవారే. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు? మాజీ ముఖ్యమంత్రి వారసులం అని సగర్వంగా విజయకేతనం ఎగరేస్తారా? లేక విఫల నేతలుగా మిగులుతారా?

MY FATHER CM: గత ముఖ్యమంత్రి వారసుల రాజకీయ జీవితం ఎలా ఉంది..?
Follow us on

ఈ ఎన్నికలు కాస్త ప్రత్యేకమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రుల వారసులు అరడజను మంది పోటీ చేస్తున్నారు. వారిలో చాలామంది లెగసీని కంటిన్యూ చేయలేక రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉన్నవారే. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు? మాజీ ముఖ్యమంత్రి వారసులం అని సగర్వంగా విజయకేతనం ఎగరేస్తారా? లేక విఫల నేతలుగా మిగులుతారా?

‘మా నాన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి’. చాలా పవర్‌ఫుల్‌ డైలాగ్‌ కదూ..! తండ్రి ముఖ్యమంత్రి అయితే ఇక ఆ ఇంటి వారసులకు తిరుగే ఉండదు. ఎమ్మెల్యే కుమారుడే ఎమ్మెల్యే అవుతున్నప్పుడు, మంత్రి వారసులు పెద్ద పదవులు అనుభవిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వారసులు ముఖ్యమంత్రి కాలేరా? అలాంటి ఉదాహరణలు భారతదేశంలో బోలెడు. కానీ, ఒక్కోసారి సీన్ రివర్స్‌ అవొచ్చు కూడా. ‘మా నాన్న ముఖ్యమంత్రి’ అని చెప్పుకోడానికే తప్ప ఆ లెగసీని ఉపయోగించుకోలేని వాళ్లు బోలెడు. తెలంగాణలో జలగం వెంకట్రావు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి నేతలు అరడజనుకు పైగా ఉన్నారు.

నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన 9 నెలల్లలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇలాంటి రికార్డ్ మరెవరికీ లేదు. కాని, నందమూరి వారసులు చాలామందే ఉన్నా.. ఏ ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ స్థాయి వరకు కూడా వెళ్లలేకపోయారు. నందమూరి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నది ఇద్దరే. ఒకరు నందమూరి బాలకృష్ణ. మరొకరు దగ్గుబాటి పురంధేశ్వరి. నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఎమ్మెల్యే స్థాయిని దాటి ఏ పదవి చేపట్టలేదు. 2014లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. టీడీపీకి కంచుకోట అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి 16వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో వైసీపీ వేవ్‌లోనూ సత్తా చాటారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. టీడీపీలో చంద్రబాబే సీఎం అభ్యర్ధి, ఆ తరువాత స్థానం లోకేశ్‌కు వెళ్తుంది. అంటే, తన తండ్రి స్థాపించిన పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లలేరనే అర్థం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.

నందమూరి వంశం నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నది దగ్గుబాటి పురంధేశ్వరినే. తండ్రి స్థాపించిన టీడీపీలో కాకుండా కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి, రెండుసార్లు ఎంపీ అభ్యర్ధిగా ఓడిపోయారు. 2004లో మొదటిసారి బాపట్ల నియోజకవర్గం నుంచి, 2009లో విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగానూ చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరి 2014లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పురంధేశ్వరి సీఎం పీఠం వరకు వెళ్లాలంటే.. చాలా పొలిటికల్ జర్నీ చేయాలి. ఇక్కడ కూడా ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ముఖ్యమంత్రి స్థానం వరకు వెళ్లడం కష్టమే.

ఇక నారా లోకేశ్. చంద్రబాబు వారసుడిగా ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లగలిగే స్కోప్‌ ఉన్న లీడర్ లోకేశ్ ఒక్కరే కాబోలు. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఛాన్స్‌ ఉన్న ఒకే ఒక్క లీడర్ కూడా. కాకపోతే, పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యారు. అందులోనూ, గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న రాజధాని ప్రాంతంలోనే ఓటమి చవిచూశారు. చంద్రబాబు రాజకీయ వారసుడిగా, టీడీపీకి భవిష్యత్ అధ్యక్షుడిగా ప్రొజెక్ట్ చేస్తున్న నారా లోకేశ్.. తొలి ఎన్నికల్లోనే ఓడిపోవడం ఓ సెన్సేషన్. ఎమ్మెల్సీగా, మంత్రిగా చేసినప్పటికీ.. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. రాజకీయంగా పెనుమార్పులు జరిగి, ముఖ్యమంత్రి పదవికి టీడీపీలోనే ఇంకెవరైనా అడ్డొస్తే తప్ప.. సీఎం పీఠం నుంచి దూరం కావడం అనేది జరక్కపోవచ్చు. ఏదేమైనా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుమారుడిగా ఓడిపోవడం ఓ చెరిపేయలేని రికార్డే.

ఇక నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు గానీ.. ఆయనలా ముఖ్యమంత్రి స్థానానికి, ఆ స్థాయికి మాత్రం వెళ్లలేదు. ఇకపై వెళ్లడమూ అసాధ్యమనే చెప్పాలి. ప్రస్తుతం జనసేనలో నెంబర్‌-2 పొజిషన్‌లో ఉన్నారు నాదెండ్ల. ఆ పార్టీలో ఉన్నంత వరకు నెంబర్‌-2నే. జనసేన గనక అధికారంలోకి వస్తే.. పవన్ కల్యాణే సీఎం అవుతారు తప్ప నాదెండ్లకు నో ఛాన్స్. ఆమాటకొస్తే ఏ పార్టీలో చేరినా సీఎం పీఠం వరకు వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి. నాదెండ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. మరో రెండుసార్లు ఓడిపోయారు. ప్రస్తుతం తెనాలి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ రిజల్ట్‌ ఏమవుతుందో చూడాలి.

కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి. ఈయన తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కానీ, ఆయన పొలిటికల్‌ లెగసీని అందుకోలేకపోయారు. రాజకీయాల్లోకి వచ్చిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి.. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా చేశారు. ప్రస్తుతం డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. సో, ఏరకంగా చూసినా.. ముఖ్యమంత్రి స్థానం వరకు వెళ్లలేరు. అదే సమయంలో రాజకీయంగానూ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2014లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు కూడా.

నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి.. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేద్దామనుకున్నప్పటికీ.. అప్పటి విభజన పరిస్థితుల కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత బీజేపీలోకి వెళ్లి, 2018లో జగన్‌ పాదయాత్రలో వైసీపీలో జాయిన్‌ అయ్యారు. 2019లోనూ పోటీ చేయలేదు. ప్రస్తుతం వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఒక విధంగా నేదురుమల్లి లెగసీని పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకోలేదనే చెప్పాలి.

చివరిగా వైఎస్ షర్మిల గురించి చెప్పుకోవాలి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ వారసుడిగా సీఎం జగన్‌ ఉన్నారు. ఆయన పొలిటికల్‌ లెగసీని పర్ఫెక్ట్‌గా ముందుకు తీసుకెళ్లిన లీడర్‌ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీ నుంచి వైఎస్ షర్మిల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాలం కలిసొస్తే కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్ధిగా ఉండబోయేది షర్మిలనే కావొచ్చు. కాని, ఏపీలో అధికారానికి కాంగ్రెస్ పార్టీ చాలా దూరంలో ఉంది. పైగా ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. ఈసారి పోటీ చేస్తారా, చేస్తే ఏ రిజల్ట్‌ వస్తుందనేది వేచి చూడాలి. మొత్తానికి సీఎం జగన్‌ తప్ప.. ఒక ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అవడం ఏపీలో జరగలేదు. పొలిటికల్‌ జర్నీ అయితే సాగుతోంది గానీ.. వాళ్లేవరూ సీఎం పీఠం వరకు రాలేకపోయారు. ఇక మీదట ఎవరైనా వస్తారేమో చూడాలి..!

 మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…