చేపల ధర విషయంలో మాటా.. మాటా పెరిగింది. వివాదం చినికి..చినికి గాలివానగా మారింది. సిల్లీ ఇష్యూ కాస్తా.. కత్తులతో దాడులు చేసుకునే వరకు వచ్చింది. చేపల ధరను తగ్గించాలని అడిగినందుకు.. ఇద్దరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు విక్రయదారుడు. ఈ ఘటన ఏపీ(AP)లోని కృష్ణాజిల్లా(Krishna District) గుడివాడలో జరిగింది. బంటుమిల్లి(Bantumilli) రోడ్డులోని శివ చేపల దుకాణంలో.. మహమ్మద్ రబ్బానీ చేపలు కొనుగోలు చేశాడు. కొన్న చేపల్లో అర కిలోకిపైగా జన రావడంతో రేటు తగ్గించమని రబ్బానీ అడిగాడు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. దూషణల వరకు వెళ్లింది వ్యవాహారం.. ఆవేశానికి లోనైన చేపల దుకాణ ఓనర్ శివ.. రబ్బానీపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రబ్బానీ బంధువులు రఫీ, రసూల్.. అక్కడికి వచ్చి ఇదేం పద్ధతని శివను ప్రశ్నించారు. దీంతో శివ మళ్లీ రెచ్చిపోయాడు. తన కుమారుడితో కలిసి రఫీ, రసూల్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రసూల్ గొంతుపై గాయం అవగా.. రఫీ చేతులు తెగిపోయాయి. బాధితులను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడ షిఫ్ట్ చేశారు. కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన నేపథ్యంలో గుడివాడ ముబారక్ సెంటర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. శివ దాడిని నిరసిస్తూ.. అతని చేపల దుకాణానికి చెందిన వ్యాన్‌ను దగ్ధం చేశారు పలువురు యువకులు. దీంతో పోలీసులు అలెర్టయ్యారు. పికెటింగ్ పెట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.