Pulichitala flood flow to Prakasam Barage: నిన్న విరిగిపడ్డ పులిచింతలలో స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఇప్పటికే స్టాప్ లాక్ గేటు ఏర్పాటు కోసం నిపుణులు ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు. నాగార్జునసాగర్, పోలవరం,తుపాకుల గూడెం నుంచి నిపుణులను పిలిపించారు. వీరంతా గేట్టు బిగించడం, డిజైన్లు రూపొందించడంలో ఎక్స్‌ఫర్ట్స్. పోలవరం నుంచి కొందరు ఇంజనీర్లను పిలిపిస్తున్నారు. ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని ఆపేందుకు స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుకు 11 సెగ్మెంట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కోదానికి అరగంట నుంచి 45 నిమిషాల టైమ్ పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తోంది. ఒక్కసారి ఈ ప్రవాహం తగ్గితే స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రయత్నాలు మొదలవుతాయని తెలుస్తోంది.
మరోవైపు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణ నదికి వరద ప్రవాహాం కొనసాగుతోంది. దీంతో అధికారులు దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలావుంటే, పులిచింతల ప్రాజెక్టులో గేట్లు ఎత్తుతుండగా 16వ నెంబరు గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీనికి కారణాలేంటనే విషయంపై జలవనరులశాఖ నిపుణులు పరిశీలిస్తున్నారు. పదవీ విరమణ పొందిన అధికారుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ప్రాథమికంగా నిర్మాణ సమయంలో నాణ్యత పాటించకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ముందుగా తలుపు ఎత్తేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో నట్టు విరిగిపోయి 16వ నెంబర్ గేటు జారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. తలుపు తయారీకి ఉపయోగించిన ఇనుము, ఇతర పరికరాల నాణ్యతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ ఒక్కదానితోనే సమస్య ప్రారంభమవలేదని, మరిన్ని సమస్యలు తలెత్తబోతున్నాయని జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన చర్యలు తీసుకోకపోతే విజయవాడకు భారీ ప్రమాదం పొంచివుందనే హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, పులిచింతల నుంచి భారీగా వరద రావడంతో ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా మారింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసింది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 5 లక్షల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 4,34,517 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 5,11,073 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. వరద పెరిగే కొద్ది ముంపు గురికాబోయే ప్రభావిత ప్రాంతాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విపత్తుల నివారణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు.
అటు విజయవాడకు వరద ముప్పు పొంచి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుంచి దిగువకు 4.17 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసిన అధికారులు.. ముంపునకు గురయ్యే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సహాయక చర్యల కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.