Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఇకపై వానలే వానలు.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ ఇదే

| Edited By: Ravi Kiran

Aug 31, 2023 | 8:53 AM

వర్షాకాలంలోనూ ఎండలు వేడి పుట్టిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు ఆశించినంతగా ప్రభావం చూపలేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు అంతగా కురవలేదు. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కొనసాగుతున్నాయి.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఇకపై వానలే వానలు.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ ఇదే
Telangana Rains
Follow us on

విశాఖపట్నం, ఆగష్టు 31: వర్షాకాలంలోనూ ఎండలు వేడి పుట్టిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు ఆశించినంతగా ప్రభావం చూపలేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు అంతగా కురవలేదు. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. అయితే ఈ పరిస్థితి మరికొద్ది రోజుల్లో మారబోతుందంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ వర్షాలు మొదలవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. వాయువ్య దిశ నుంచి పొడి గాలులు తీస్తున్నాయి. దీంతో దక్షిణ భారతదేశమంతా డ్రై వెదర్ కంటిన్యూ అవుతుంది. రెయినీ సీజన్‌లోనూ హాట్ వెదర్ కనిపిస్తోంది. దీనికి తోడు ద్రోణి కూడా బంగాళాఖాతం ఉత్తరం వైపు పైకి ఆవరించి ఉంది. అది నెమ్మదిగా దక్షిణ వైపు వస్తేనే గానీ.. వర్షాలు పడే ఛాన్స్‌లు తక్కువగా ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఉదయం చాలా చోట్ల ఉష్ణోగ్రతలు నమోదయి.. వేడి వాతావరణం కొనసాగుతూ.. సాయంత్రానికి చల్లబడే పరిస్థితిలో ఉంటాయని అంటున్నారు. కన్విక్టివ్ యాక్టివిటీతో వాతావరణం చల్లబడి ఒకటి రెండు చోట్ల జల్లులతో కూడిన వాతావరణం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా పడతాయని చెబుతున్నారు.

ఎల్నినో ఎఫెక్ట్ కూడా..

రుతుపవనాలు ఆలస్యంగా ఆరంభమైనప్పటికీ.. ఆశించినంత వర్షాలు పడలేదు. జూన్, జూలై నెలలో వర్షాలు ఆశించినంతగా లేవు. జూన్‌లో మోస్తారు వర్షాల కురవగా.. జూలైలో కాస్త పరవాలేదనిపించాయి. తెలంగాణలో వర్షాలు ఒకింత పర్వాలేదు అనిపించినప్పటికీ.. ఏపీలో వర్షభావం కొనసాగుతుంది. ఆగస్టు తొలిపక్షంలో ఎండలు దంచికొట్టాయి. ఆ తర్వాత వాతావరణం కాస్త చల్లబడినా.. వర్షాలు ఆమేర పడలేదు. ఆగస్టులో సాధారణంగా అంటే తక్కువ వర్షపాతం రికార్డ్ అయింది. మళ్లీ ఎండల పరిస్థితి వచ్చింది. అయితే రుతుపవన ద్రోణి ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లిపోవడమే తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితులకు కారణమని వాతావరణ శాఖ చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో బ్రేక్ మాన్సన్ కూడా వర్షభావ పరిస్థితులకు కారణమై ఉండొచ్చని అంచనా. ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఈసారి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఆగస్టు నెల ఆఖరి వరకు పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ సాధారణ స్థితిలు నెలకొంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాది వైపు ఉన్న రుతుపవన ద్రోణ కాస్త.. దక్షిణాదివైపు మల్లుతోందని.. అదే జరిగితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడి వర్షాలకు ఆస్కారం ఉందని అంటున్నారు. రుతుపవన ద్రోణితో ఒరిస్సా ఛత్తీస్గఢ్‌కు భారీ వర్ష సూచన.. ఏపీ తెలంగాణలో కూడా మోస్తరు నుంచి వర్షాలు కురిసే ఆస్కారం ఉందని అంటున్నారు. ఒకవేళ ఉదయం పూట ఎండ ఉన్నప్పటికీ.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కూడా పడతాయని చెబుతున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.

రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో ఉత్తరం వైపు విస్తరించి ఉంది. దీంతో రుతుపవనాలు మరింత యాక్టివ్‌గా మారితే.. బంగాళాఖాతంలో అల్పపీడనంలో కూడా ఆస్కారం ఉంది. అల్పపీడనం ఏర్పడకపోయినా.. థండర్ స్టార్మ్ యాక్టివిటీతో ఈ సీజన్‌లో కురవబోయే వర్షాలు కచ్చితంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో… ఇక సెప్టెంబర్ మొదటి వారంలో చల్లని వాతావరణంతో పాటు, మళ్లీ వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాలను పలకరించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..