ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. గురువారం వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ద్రోణి ప్రభావంతో Andhra Pradesh, Telangana రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రుతుపవనాలు విస్తరిస్తున్నాయని.. దీంతోపాటు.. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల పిడుగుపాటుకు అవకాశం వుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో గురువారం మేఘవృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం (18-06-26) కోస్తాంధ్ర జిల్లాలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.. 4 రోజుల్లో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని.. ఈ క్రమంలోనే.. తెలంగాణ మీదుగా ఏపీలోని దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు గురువారం తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతోపాటు.. ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
హీట్‌వేవ్ అలర్ట్
ఇదిలాఉంటే.. తెలంగాణకు రెండు రోజుల హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది. 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని 10 జిల్లాలకు హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో హీట్‌వేవ్ ప్రభావం కొనసాగుతుందని.. మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని సూచించింది. వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని.. రేపటి వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
జాగ్రత్త..
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని అధికారులు సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
