ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆ మండలాలకు తీవ్ర వడగాలుల హెచ్చరిక

ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భగభగమండే భానుడి ప్రభావానికి జనం విలవిలలాడిపోతున్నారు. వడగాలులతో ఉదయం 10 గంటలు దాటితే జనం రోడ్లపైకి వచ్చేందుకు సాహసించడం లేదు. ఏపీలో శనివారంనాడు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. పల్నాడు జిల్లా రావిపాడులో 43.7°C రికార్డు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది.

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆ మండలాలకు తీవ్ర వడగాలుల హెచ్చరిక
AP Heatwave Alert

Updated on: Apr 12, 2025 | 10:57 PM

ఏపీలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు జిల్లా రావిపాడులో 43.7°C రికార్డు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. 119 ప్రాంతాల్లో 41°C కు పైగా నమోదయ్యింది. శనివారం 14 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాలులు వీచాయి. ఆదివారంనాడు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వడగాలల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

ఎండ తీవ్రత

రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు మరింత పెరుగుతోంది. శనివారం పల్నాడు జిల్లా రావిపాడులో 43.7°C, ప్రకాశం జిల్లా దరిమడుగులో 43.4°C, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.8°C, తూర్పుగోదావరి జిల్లా చిన్నాయిగూడెంలో 42.6°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. ప్రకాశంలో 22చోట్ల, బాపట్లలో 18, పల్నాడు 17, నెల్లూరు 13, ఎన్టీఆర్ 8, ఏలూరు 7, గుంటూరు 7, తిరుపతి 7, కృష్ణా జిల్లాల్లో 6 ప్రాంతాల్లో, తదితర జిల్లాల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 119 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యింది.

తీవ్ర వడగాలులు

ఆదివారం (13-03-25) శ్రీకాకుళం 7, విజయనగరం 11, పార్వతీపురంమన్యం 10, ఏలూరు భీమడోలు, ఎన్టీఆర్ జి.కొండూరు మండలాల్లో(30) తీవ్ర వడగాలులు, అలాగే 67 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సోమవారం 12 మండలాల్లో తీవ్ర,19 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.

వడగాలులు

శ్రీకాకుళం 2, విజయనగరం 7, మన్యం 2, అల్లూరి-3, తూర్పుగోదావరి 1, పశ్చిమ గోదావరి 2, ఏలూరు 10, కృష్ణా 11, ఎన్టీఆర్ 5, గుంటూరు 16, బాపట్ల-5, పల్నాడు 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి

⛈️ వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు.

వడదెబ్బ లక్షణాలు :

☀️తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జర్వం కలిగియుండటం, మత్తునిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.

☀️ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

✅స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండండి. టీవి చూడండి, రేడియో వార్తలు వినండి, వార్తాపత్రికలు చదవండి.

✅ నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి.

✅వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగండి.

✅ ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగవచ్చును.

✅ వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి.

✅ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని , నిమ్మరసముగాని, కొబ్బరినీరు గాని తాగాలి.

✅తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తలతిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి.

✅ ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాను వాడండి. చల్లని నీరుతో స్నానం చేయండి.

✅ తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను ఉపయోగించండి.

✅ మేడపైన మొక్కలు, ఇంట్లో ని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి.

☀️ ఎండ తీవ్రతంగా ఉన్నప్పుడు చేయకూడనివి :-

❌ ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో నలుపురంగు,మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.

❌ గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదు.

❌ మధ్యాహ్నం తరువాత (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 3గంటల మధ్యకాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు.

❌బాలింతలు,చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. వీరిపై ఎండ ప్రభావం త్వరగా చూపే అవకాశం ఉంది.

❌ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానుకోండి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే పదార్దాలను తీసుకోవద్దు.

❌ప్రకాశించే లైట్ బల్బులను వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి.

❌ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్ధములు తీసుకొనకూడదు.

❌శీతలపానీయములు,  ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యము ఏర్పడుతుంది.

❌ ఎండ ఎక్కువగా వున్న సమయంలో వంట చేయకుండా ఉండండి. వంట గది తలుపులు, కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోండి.

❌ వడ దెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏమాత్రం ఆలస్యం చేయరాదు.

(ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన సమాచారం)