Heat wave sweeps Prakasam district : సూర్యుడు ఉగ్ర రూపం దాల్చాడు…. భగభగ మంటల్ని వెదజల్లుతున్నాడు…..రెండు రోజుల నుంచి ప్రకాశంజిల్లా వ్యాప్తంగా చెలరేగిపోతున్నాడు. జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నేడు కూడా పరిస్థితి అలాగే ఉంది. దీంతో ప్రకాశంజిల్లా వాసులు ఎండదెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు కరోనా మరోవైపు మండుతున్న ఎండలతో జనం ఇళ్ళల్లోనుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. మండుతున్న ఎండల కారణంగా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే 40 నుంచి 43 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఈ పరిస్థితి అధికంగా ఉండగా ఇతరచోట్ల కూడా ఐదారు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఆ దిశలో భూఉపరితలం నుంచి గాలులు వీస్తుంటడంతో ప్రస్తుత వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏప్రిల్ ఆఖరు నుంచి మే ఆఖరు వరకూ ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే ఈ ఏడాది నెలరోజుల ముందే సూర్యుడు చెలరేగిపోతున్నాడు. పలు ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పొన్నలూరులో 43.60 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, అదే మర్రిపూడిలో 43.50, కనిగిరి మండలం నందనమారెళ్లలో 43.40, కురిచేడులో 43.40 డిగ్రీలుగా ఉంది.
అలాగే పంగులూరు కంభం, వెలిగండ్లతోపాటు మరికొన్నిచోట్ల 43 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం, అద్దంకి, దర్శి, కందుకూరు తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీలకుపైగా ఉన్నాయి. ఒంగోలులో చూస్తే ఈనెల 29వ తేదీకి ముందు వారంరోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీలు ఉండగా గత రెండు రోజులుగా ఒక్కసారిగా మార్పు వచ్చింది. మంగళవారం 40.1 డిగ్రీలు ఉంటే బుధవారం 42.6 డిగ్రీలు నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా రెండు డిగ్రీలకుపైగా పెరగడంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు వేడిగాలులు కూడా అధికంగానే ఉంటున్నాయి.
Read also : EC Bans DMK A Raja : మాజీ కేంద్రమంత్రి, డీఎంకే నేత ఎ రాజాపై ఎన్నికల కమిషన్ సీరియస్, 48గంటల పాటు నిషేధం