
ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రా, యానాంలలో చాలా వరకు వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని.. వేడి, తేమ కారణంగా కొన్ని చోట్ల తీవ్రమైన వడగాలులు, మరికొన్ని చోట్ల వడగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక దక్షిణ కోస్తాంధ్రా విషయానికొస్తే.. ఇవాళ చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశముండగా.. కొన్ని ప్రాంతాల్లో వేడి, తేమ కారణంగా అసౌకర్యమైన వాతావరణం ఏర్పడవచ్చునని అంటున్నారు.
ఇక మంగళవారం, బుధవారం వాతావరణం పొడిగా.. అలాగే వడగాలులు ఒకట్రెండు చోట్ల వీచే అవకాశముందట. రాయలసీమలో అయితే వచ్చే మూడు రోజులు పొడి వాతావరణం, అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. కాగా, ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల రోజులు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందంటున్నారు అధికారులు.