
పల్లె పట్టణం అన్న తేడా లేదు. ఎక్కడా చూసిన గ్రామ సింహాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా కరోనా తర్వాత కుక్కల సంఖ్య మరింత ఎక్కువైంది. ఇదే సమయంలో జీవ కారుణ్య సంస్థలు కూడా వీథి కుక్కల పట్ల నిర్ధాక్షణ్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టులను ఆశ్రయించడం మొదలు పెట్టాయి. దీంతో కుక్కల సంఖ్య పెరిగిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తాయి. గుంటూరు నగరంలో గత కొంతకాలంగా గ్రామ సింహాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ ఏడాది జనవరి నెలలో సంపత్ నగర్ ప్రాంతంలో ఇద్దరూ చిన్నారులపై కుక్కల దాడి చేయడం కలకలం రేపింది. స్థానికులు సకాలంలో స్పందించడంతో చిన్నారుల ప్రాణాలు రక్షించగలిగారు. గతంలో నగర కమీషనర్ కు స్థానికులు కుక్కల బెడద తగ్గించాలంటూ అనేక ఫిర్యాదులు చేశారు. అయితే యానిమల్ లవర్స్ మాత్రం కుక్కలను బంధిస్తే కేసులు వేస్తామంటూ బెదిరింపులకు దిగారు. గత నెలలో వీధికుక్కును చంపిన యువకుడిపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకునేలా జంతు ప్రేమికులు చేయగలిగారు.
ఈ క్రమంలోనే కమీషనర్ చేకూరి కీర్తి కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించాలని నిర్ణయించారు. కుక్కలు ఎక్కువుగా ఉన్న వార్డులను గుర్తించి అక్కడ నుండి వాటిని ఏటుకూరు రోడ్డులోని ఏబిసి సెంటర్ కు తరలిస్తారు. అక్కడ నిపుణులైన పశువైద్యులచే కుని ఆపరేషన్లు చేస్తారు. నాలుగు రోజుల పాటు సంరక్షనలోనే ఉంచి తర్వాత వాటిని వాటి స్వస్థలాలోనే విడిచిపెడతారు.
వీటితో పాటు వాటికి రేబిస్ వ్యాక్సిన్లు కూడా వేయిస్తునట్లు నగర కమీషనర్ కీర్తి చేకూరి తెలిపారు. అయితే కుక్కలను పట్టుకుంటున్న సమయంలో స్థానికులు, జంతు ప్రేమికులు, జీవ కారుణ్య సంస్థలు సహకరించాలని వాటిని వధించడానికి తీసుకెళ్లడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కమీషనర్ నిర్ణయంతో కుక్కల బెడద కొంతమేరకైనా తగ్గుతుందని స్థానికులు భావిస్తుంటే వీథికుక్కలన్న చులకన భావంతో కార్పోరేషన్ వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జంతు ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి