
గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెలూన్‌తో ఆడుకుంటూ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బెలూన్ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెదకాకానికి చెందిన శ్రీనివాసరావు, వెంకటరమణ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ దంపతులు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఇద్దరు పెద్ద కుమార్తెలు పాఠశాలలో చదువుతుండగా, మూడో కుమార్తె అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. నాలుగేళ్ల చిన్నారి శిరీష మాత్రం తల్లితో ఇంటి వద్దే ఉండేది. బుధవారం ఉదయం బెలూన్ కావాలని చిన్నారి మారం చేయడంతో తల్లి కొంత డబ్బు ఇచ్చింది. దీంతో మూడో అక్కతో కలిసి ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి బెలూన్ కొనుక్కొచ్చింది. ఇంటి వద్ద బెలూన్‌తో సరదాగా ఆడుకుంటూ దాంట్లో గాలి ఊదుతుండగా ఒక్కసారిగా బెలూన్ గొంతులోకి వెళ్లిపోయింది. దీంతో ఊపిరి ఆడక చిన్నారి కేకలు వేసింది.
వెంటనే గమనించిన తల్లి వెంకటరమణ చిన్నారిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నలుగురు పిల్లల్లో చిన్నదైన శిరీష మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారులకు బెలూన్లు వంటి వస్తువులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..