
విశాఖపట్నం, అక్టోబర్ 26: మరో 10 నిమిషాల్లో పెళ్లి.. వరుడు వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది.. అందుకు తగ్గ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. పెళ్లి జరగుతున్న క్రమంలో వరుడు పాస్టర్ మాట వినడం ఆకస్మికంగా మానేశాడు. పాస్టర్ ఒకటికి రెండు, మూడు, పది సార్లు చెప్పినా వినడం లేదు.. ఇలా ఏం జరుగుతుందో పాస్టర్ కు అర్దం కాలేదు. మెల్లిగా అబ్బాయి చెవిలో అడిగాడు, ఏమైంది? అని.. పెళ్లి కొడుకు చెప్పిన మాట విని పాస్టర్ షాకయ్యాడు.. ఈ పెళ్లి ఇష్టం లేదని వరుడు అతనికి చెప్పాడు. దీంతో ఆ విషయం బయటకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఈ క్రమంలో పాస్టర్ ఆందోళన పడుతుండగా.. అతని ముఖ కవళికలు చూసి ఇరువర్గాల వారికి విషయం అర్థమైంది. చిన్నగా వధువు బంధువులకు సమాచారం తెలిసింది. వెంటనే వాళ్లంతా ఆగ్రహంతో ఊగిపోయారు. వధువు బందువుల ఆగ్రహం చూసి వరుడు భయపడిపోయాడు. కొడతారని భావించి నేరుగా బాత్ రూమ్ కు అని.. చెప్పివెళ్లి లోపల గడియ పెట్టుకున్నాడు. బయటకు వస్తే కొడతారని భయం.. అలా లోపల ఎంత సేపు ఉంటామనుకున్నాడు.. వెంటనే డయల్ 100 కి ఫోన్ చేశాడు. తన దీన గాథను వివరించాడు. మీరు త్వరగా రాకపోతే నేను స్మశానానికి పోవాల్సి ఉంటుందని వాపోయాడు. దీంతో హుటాహుటిన స్థానిక గోపాలపట్నం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయినప్పటికీ వధువు బంధువులు అంగీకరించలేదు. అతనిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గోపాలపట్నం స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో పెళ్లికి వచ్చిన ఇరు వర్గాల బంధువులు అందరూ.. పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో సీన్ స్టేషన్‌కు మారింది.
చాలా అరుదుగా జరిగే ఘటననే అయినా పోలీసులు వరుడి నుంచి వివరాలు లాగే ప్రయత్నం చేశారు. అసలు ఈ దశలో పెళ్లి ఎందుకు వద్దంటున్నాడో కనుక్కునే ప్రయత్నం చేశారు. విశాఖ నగరానికి చెందిన యువతితో, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యువకుడికి పెద్దల సమక్షంలో వివాహం కుదిరింది. నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ముహూర్తం పెట్టుకున్నారు. క్రిస్టియన్ పద్ధతిలో వివాహం జరపాలని నిర్ణయించారు. ఆమేరకు ఏర్పాట్లు చేశారు. పెళ్లి వస్త్రాలు ధరించి వధువు, వరుడితో పాటు ఇరు కుటుంబాల బంధువులు మండపం వద్దకు చేరుకున్నారు. పెళ్లి క్రతువు ప్రారంభం అయింది. మరో పది నిమిషాల్లో పెళ్లి క్రతువు ప్రారంభం కావాలి. ఇంతలో పెళ్లి వద్దని వరుడు పాస్టర్‌కు చెప్పడం, ఆ విషయం తెలిసి వధువు తరపు వారంతా ఆగ్రహించారు. భయపడ్డ వరుడు బాత్ రూం కు వెళ్లి దాక్కున్నాడు. అక్కడ నుంచే డయల్ 100కు ఫోన్ చేసి తన బాధను ఏకరవు పెట్టాడు. వెంటనే పోలీసులు కళ్యాణ మండపం చేరుకుని ఇరు వర్గాల పెద్దలతో చర్చించారు.
వివాహం కుదిరిన తర్వాత నెల నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారు..అయితే పెళ్లి పనులు, పిలుపులు నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆ అబ్బాయి ఫోన్ చేసిన సందర్భంలో ఒకటి రెండు సార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేక పోయిందట వధువు. అప్పటినుంచి మనసులో పెట్టుకున్న పెళ్లి కొడుకు సరిగా మాట్లాడడం లేదట. అలా ముభావంగా ఉంటూ పెళ్లి పీటల పై దాకా వచ్చిన వ్యవహారాన్ని సడన్ గా నిలిపి వేశాడని పోలీసులు చెబుతున్నారు
దీంతో పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జరిగింది. అబ్బాయికి నచ్చ చెప్పి మళ్ళీ పెళ్లి చేయాలని ఇరువర్గాలు ప్రయత్నించాయి. పెళ్లికి ముందే అర్థం చేసుకోకుండా ఫోన్ మాట్లాడడం లేదంటూ వంక పెట్టి పీటల పైకి వచ్చిన పెళ్లినీ, నిలిపివేసిన వ్యక్తిని తాను కూడా పెళ్లి చేసుకోనని అమ్మాయి స్పష్టం చేసిందట. ఇరు వర్గాలు ఎంత చెప్పినా వినలేదని బంధువులు పేర్కొంటున్నారు.
అయితే అర్ధాంతరంగా పెళ్లి పీటలపై కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో పరువు పోతుందని భావించిన అమ్మాయి తండ్రి మాత్రం తట్టుకోలేకపోయాడు. గుండెలవిసేలా అతను రోదించడం చూసిన ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..