AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ అమలుకు సర్కార్ రంగం సిద్ధం..!

|

Oct 13, 2021 | 5:19 PM

AP Employees PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న PRC ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరులోపే ఇచ్చేలా ప్రక్రియను మొదలు పెట్టింది సర్కార్.

AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ అమలుకు సర్కార్ రంగం సిద్ధం..!
Ap Prc
Follow us on

AP Employees PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న PRC ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరులోపే ఇచ్చేలా ప్రక్రియను మొదలు పెట్టింది సర్కార్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చల అనంతరం ఉద్యోగుల సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు రాజీపడబోమన్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎంఓ అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ, హెల్త్ కార్డులు, హెల్త్ ఫీజుల రీయింబర్స్ మెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న ఆయన.. ఈ నెలాఖరుకు పీఆర్సీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల భద్రత విషయంలో సీఎం జగన్ రెండడుగులు ముందే ఉంటారని సజ్జల అన్నారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి ఈ నెలాఖరులోపు పీఆర్‌సీని ఇచ్చేలా కార్యాచరణ ఉంటుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రధాన సమస్యలన్నింటినీ వచ్చే నెలలోపు పరిష్కరిస్తామన్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, గతంలోలా ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోబోమన్నారు సజ్జల. అలాగే, ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చారని ఆయన గుర్తుచేశారు. కొవిడ్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు రావడంతో రెండేళ్లుగా సమస్యలు పరిష్కారం కాలేదని సజ్జల అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని.. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్ హామీ సీఎం జగన్ నెరవేర్చారని గుర్తుచేశారు. పీఆర్సీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, మిగిలిన విషయాలను కూడా క్రమ పద్ధతిలో చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

మరోవైపు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రాజీపడే ప్రసక్తే లేదన్నారు ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. సీఎస్‌తో చర్చలు జరుపుతామని, తమ కార్యాచరణ తమకు ఉందని చెప్పారు. ఇదిలావుంటే, గత కొన్నిరోజులుగా ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పలుసార్లు ఉద్యోగ సంఘాలు భేటీ కాగా.. ప్రభుత్వ పెద్దలు ఫోన్ చేసి వారిని శాంతింపజేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, పెన్షన్లు సకాలంలో రాకపోవడం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడమే కాకుండా.. ఉద్యోగులకు కూడా కొన్ని నెలలు సమయానికి జీతాలు క్రెడిట్ కాకపోవడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభువం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ మేరకు పీఆర్సీ అమలుపై హామీ ఇచ్చింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also… Badvel By Election: బద్వేలు నియోజకవర్గంలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. బరిలో నిలిచిన అభ్యర్థులు 15మంది