AP RTC Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ బీమా సౌకర్యం కల్పించింది. ఇందుకోసం దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రమాదవశాత్తు ఉద్యోగి మృతి చెందితే 40 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. శాశ్వత వికలాంగులైతే 30 లక్షలు, సహజ మరణానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించనున్నారు.
ఉద్యోగుల పిల్లల పేరిట రూ.5 లక్షల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహాల కోసం చేసిన రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుండగా వీటికి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బీమా కోసం ఉద్యోగి నెలకు రూ.200 బీమా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందంలో ఉన్నారు. దీంతో ఉద్యోగులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.
ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం వల్ల 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్దిచేకూరనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పోలీసు శాఖలో ఈ తరహా ‘కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ’ని అమలు చేస్తుండగా.. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కల్పించింది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై మరింత విపులంగా విధివిధానాలను రూపకల్పన చేయనుంది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుకి కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.