ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఈ క్రమంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం (Bhadrachalam) వద్ద ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఫలితంగా పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. సుభాష్‌నగర్, రామాలయం పరిసరాలు, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలను వరద ముంచెత్తింది. అప్రమత్తమైన అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ రాత్రికి భద్రాచలంలో వరద తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి (Godavai) నీటిమట్టం 66 అడుగులు ఉంది. అది రాత్రికి 70 అడుగులకు చేరే అవకాశం ఉందని తెలిపారు. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం నుంచి కూనవరం, చర్ల మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి భద్రాచలం గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపేయాలని అధికారులు నిర్ణయించారు.
మరోవైపు.. కడెం ప్రాజెక్ట్ కు పెను ప్రమాదం తప్పింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకుంటోంది. ఒకానొక దశలో ప్రాజెక్టు పై నుంచి వరద రావడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రకృతి సహకరించడంతో కడెం ప్రాజెక్ట్ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్ట్‌కు వరద ఇన్‌ఫ్లో తగ్గింది. డ్యామ్‌ను డేంజర్ జోన్ నుంచి కాపాడేందుకు నీటి మట్టాన్ని 680 అడుగులకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 2,50,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,90,000 క్యూసెక్కులుగా ఉంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి