
గుంటూరు-విజయవాడ హైవేపై వాహనాలు దూసుకుపోతున్నాయి. రాత్రి తొమ్మిది గంటల సమయంలో బకింగ్ హామ్ కాలువ వద్ద ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించింది. ఒక పురుషుడు అతనితో పాటు మరొక పదేళ్ల బాలిక ఉన్నట్లు లీలగా కనిపిస్తోంది. అయితే ఆ సమయంలో కాలువ వంతెన వద్ద వారేం చేస్తున్నారో వాహనదారులకి అంతుబట్టలేదు. అయితే మనకెందుకులే అని ఎవరికి వారే వారిని దాటేసి వెళ్లిపోతున్నారు. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి పదేళ్ల బాలికను ఎత్తి కాలువలోకి విసిరేశాడు. వెనువెంటనే అక్కడ నుండి వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో హైవేపై ప్రయాణిస్తున్న మహిళ ఈ విషయాన్ని గమనించింది. వెంటనే తన వాహనాన్ని ఆపి 100కు డయల్ చేసింది.
గుర్తు తెలియని వ్యక్తి పదేళ్ల బాలికను కాలువలోని విసిరేసినట్లు చెప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సిఐ వీరేంద్ర కుమార్‌తో పాటు ఎస్డిఆర్ఎప్ బృందాలు కాలువ వద్దకు చేరుకున్నాయి. అయితే చిమ్మచీకటిలో ఆ కాలువలో ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు. మరొక వైపు ఫోన్‌లో ఇచ్చిన సమాచారం ఎంతమేరకు నిజమో కూడా అర్ధం కాని పరిస్థితి. అయితే కొంతమంది స్థానికులు కూడా స్డిఆర్ఎప్ సిబ్బందికి తోడుగా కాలువలోకి దిగారు. దాదాపు అరగంట పాటు కాలువలో జల్లెడ పట్టారు. కొద్దిసేపటి తర్వాత దాదాపు పదేళ్ల వయసున్న బాలిక మృతదేహాన్ని ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించారు. వెంటనే ఆ బాలికను ఒడ్డకు తీసుకొచ్చారు. ప్రాణం ఏమైనా ఉందన్న ఆలోచనతో సిపిఆర్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే బాలిక చనిపోయింది. వెంటనే ఆ మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు తాడేపల్లి పోలీసులు.
ఆ నిందితుడెవరనేది ఇప్పటికీ తేలలేదు. బాలికనూ గుర్తించలేకపోయారు. బాలిక ధరించిన దుస్తుల ఆధారంగా ఆచూకి ఏమైనా తెలుస్తుందేమోనని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలిక ఆ వ్యక్తికి సొంత కూతురేనా… అసలు ఎందుకీ పని చేశాడు అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ మాత్రం ఎటువంటి ఆధారాలు లభించలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..