
ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. గుంటూరుకు చెందిన ఆమెకు కొద్దీ రోజుల క్రితం కళ్లు బైర్లు కమ్మడాన్ని గమనించింది. చూపు కూడా మందగించింది. ఏం జరిగిందో తెలసుకునేలోపే స్వల్ప పక్షవాతానికి గురైంది. దీంతో ఆ బాలికను తల్లిదండ్రులు వెంటనే గుంటూరులోని శ్రేష్ట ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆమెకు కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అనే ప్రమాదకరమైన వ్యాధి వచ్చినట్లు న్యూరాలజీ వైద్యురాలు హిమబిందు గుర్తించారు. ఆ తర్వాత ఆ బాలికకు శ్రేష్ట ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ నాగార్జున ఆధ్వర్యంలోని న్యూరో క్రిటికల్ కేర్ బ్రుందం అత్యాధునిక పద్దతుల్లో వైద్యం అందించి ప్రాణాపాయం నుండి ఆ బాలికను రక్షించారు. అసలు ఏంజరిగిందని వైద్యులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.
బాలికకు కొద్దీ రోజుల క్రితం ముక్కుపై మొటిమ వచ్చింది. ఆ మొటిమ ఇబ్బందిగా మారడంతో బాలిక దాన్ని పిన్నీస్ తో గుచ్చింది. దీంతో ఆమెకు తెలియకుండానే ఇన్ఫెక్షన్ల బారిన పడింది. వారం రోజుల పాటు పట్టించుకోకపోవడంతో ఆ ఇన్ఫెక్షన్ల రెండు కళ్లపై ప్రభావం చూపింది. దీంతో చూపు మందగించింది. దీన్ని బైలేట్రల్ ఆర్బిటాల్ సెల్యులైటిస్ అనే వ్యాధిగా వైద్యులు చెప్పారు. ఆ తర్వాత ఈ ఇన్ఫెక్షన్ల మెదడుకు చేరింది. మెదడుకు ఇన్ఫెక్షన్ల సోకడంతో రక్తం గడ్డ కట్టి పక్షవాతానికి దారి తీసింది. ఆ తర్వాతే ఆమె తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లడం వైద్యులు దాన్ని కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ గా గుర్తించి వైద్యం అందించడం జరిగింది. అయితే ఆమె ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటోంది.
మొటిమలు వస్తే పిన్నీస్ తో గుచ్చడం లాంటివి చేయవద్దని శ్రేష్ట ఆసుపత్రి వైద్యుడు నాగార్జున చెప్పారు. ముఖ్యంగా ముక్కు, పై పెదవి చుట్టూ వచ్చే మొటిమల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరించారు. చిన్న మొటిమే కదా అని గిల్లడం లేదా సూది, పిన్నీసు లాంటి వాటితో పొడవడం చేస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. ఈ బాలిక కేసు అందుకు ఉదాహరణ అని చెప్పారు. ఎక్కువగా మొటిమలు వస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..