Giri Grama Darshini: గిరిజనుల పద్ధతిలో వెరైటీ వివాహం.. ఆహ్వానం పలుకుతున్న గిరి గ్రామదర్శిని.. పూర్తి వివరాలివే..

|

Dec 21, 2021 | 9:57 AM

Tribe Marriage Style: పెళ్లంటే నూరేళ్ల పంట..! అందుకే వివాహాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటారు జనం. కొంతమంది డిఫరెంట్‌గా చేసుకోవాలనుకుంటారు

Giri Grama Darshini: గిరిజనుల పద్ధతిలో వెరైటీ వివాహం.. ఆహ్వానం పలుకుతున్న గిరి గ్రామదర్శిని.. పూర్తి వివరాలివే..
Giri Gramadarshi
Follow us on

Giri Grama Darshini: పెళ్లంటే నూరేళ్ల పంట..! అందుకే వివాహాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటారు జనం. కొంతమంది డిఫరెంట్‌గా చేసుకోవాలనుకుంటారు. కానీ అది కొంతమందికే సాధ్యం అవుతుంది. విభిన్నంగా వివాహం చేసుకోవాలనుకున్న కొంతమందికి ఆ కోరిక పూర్తి కాదు. అటువంటి వారి కోసమే విశాఖ ఏజెన్సీలో గిరి గ్రామదర్శిని ఆహ్వానం పలుకుతోంది. వినూత్నంగా విభిన్నంగా వివాహం చేసుకోవాలనుకునే వారికి ఆశలు తీర్చుకునేందుకు రమ్మని పిలుస్తోంది.

విశాఖ మన్యంలో పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. ప్రకృతి సహజసిద్ద అందాలతో పాటు ఆ అమాయక గిరిజన జీవనం ఈ ప్రాంతం సొంతం. ఎక్కడెక్కడో విసిరి పారేసినటున్న గిరిజన గూడెల్లో అడవిబిడ్డల జీవన ప్రమాణం తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి. ప్రత్యేకంగా వాటి గురించి తెలుసుకోవాలనే ఉంటుంది కానీ చాలా మందికి సాధ్యం కాదు. అటువంటి వారికోసం అరకులోయలోని గిరి గ్రామదర్శిని ఆహ్వానం పలుకుతోంది. ఈ గిరి గ్రామదర్శిని లో అడవి బిడ్డల జీవవైవిధ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. గూడే లు, కళారూపాలు, వస్త్రాలు, పనిముట్లు, ఆహారం, దేవతలు.. ఇలా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు.

ఇటీవల అరకు పర్యటనకు వెళ్లిన ఎంపీ మాధవి తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొంత మంది మహిళా ఎంపీలు గిరి గ్రామదర్శిని సందర్శించారు. అక్కడ గిరిజన మహిళ వేషధారణలో ముస్తాబై అనుభూతిని పొందారు. ఇలా పర్యాటకులు కూడా గిరి గ్రామదర్శిని సందర్శించి గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడమే కాదు వారి కట్టు బొట్టు వేషధారణ స్వయంగా ధరించి అడవి బిడ్డల తో మమేకం అయ్యేలా అనుభూతిని పొందుతున్నారు.

విశాఖ జిల్లా పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే.. ఈ గ్రామ దర్శిని మరో వినూత్న మైన అనుభూతి పొందేలా అవకాశాన్ని ఆఫర్ చేస్తోంది. ఆసక్తిగల వారికి గిరిజన సాంప్రదాయాలతో వివాహ వేడుక జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. వినూత్నంగా విభిన్నంగా వివాహాన్ని చేసుకోవాలనే వారికి రా రమ్మని పిలుస్తోంది. ఇందుకోసం అరకులోయలోని పెదలబుడు గిరి గ్రామదర్శినిలో పాడేరు ఐటీడీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొత్తగా పెళ్లైన జంటలు గాని, గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలనే కోరిక ఉన్న వారికి గానీ, గిరిజన వివాహ వేడుక అనుభూతిని పొందాలనుకునే వారికి గాని ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నారు. కట్టుబొట్టు దగ్గర నుంచి వివాహ విందు, అప్పగింతల వరకు వివాహ క్రతువుని అంతా వాళ్ళే చూసుకుంటారు. కానీ మీరు చేయాల్సిందల్లా కాస్త ముందుగా చెప్పుకొని ప్యాకేజీ ప్రకారం రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

కాస్త సమయం ఇస్తే చాలు.. గిరి గ్రామాల్లో వధూవరులను ఎలా ముస్తాబు చేస్తారో అదే విధంగా పెళ్లి చేసుకోవాలనే వారిని అలంకరిస్తారు. గిరిజన ఆభరణాలు దుస్తులతో వధూవరులను పెళ్లికి సిద్ధం చేస్తారు. అచ్చంగా గిరిజన పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురులా ముస్తాబు చేస్తారు. అంతే కాదండోయ్.. గిరిజన గూడే లో వివాహ వేడుకకు ఏ విధంగా అయితే మండపం ముస్తాబు చేస్తారో.. దానికి తీసిపోని విధంగా వివాహ మండపాన్ని అలంకరిస్తారు. బంధువులు, పిల్లలను కూడా గిరిజనుల మాదిరిగా తయారుచేస్తారు. ఇక మంత్రోచ్ఛారణల వివాహ వేడుక కోసం గిరిజన పూజారిని కూడా అక్కడ సిద్ధం చేస్తారు. గిరిజన ఆచారం ప్రకారం పెళ్ళి తంతు పూర్తి చేస్తారు.

ఇక విందు, వినోదానికి కూడా అక్కడ కొదవలేదు. ప్యాకేజీ ప్రకారం గిరిజన సంప్రదాయ ఆహారం పెట్టి అతిథులకు విందు ఇస్తారు. దింసా నృత్యంతో పాటు ఫైర్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ జంట.. గిరి గ్రామదర్శిని లో వివాహం చేసుకుంది. జీవితాంతం గుర్తుండిపోయేలా మధురానుభూతిని కలిగించింది. ఆదరాబాదరాగా అందరితో కలిసి చేసుకున్న వివాహానికి భిన్నంగా.. గిరి గ్రామదర్శిని లో గిరిజన సాంప్రదాయ పద్ధతిలో చేసుకున్న పెళ్లి ఈ జంటకు ఓ మధురానుభూతే..!

గిరి గ్రామదర్శిని అనేది దేశంలో ఎక్కడాలేని విధంగా దీన్ని తీర్చిదిద్దారు. అందులోకి వెళ్తే.. గిరిజనుల్లో మమేకమయ్యే మధురానుభూతి కచ్చితంగా కలుగుతుంది. దీంతో గిరి గ్రామదర్శిని చూసేందుకు క్యూ కడుతున్నారు జనం. పిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అడిగి మరీ గిరి సాంప్రదాయాలను తెలుసుకుంటున్నారు.

గిరి గ్రామ దర్శనంలో వివాహం చేసుకోవాలనే వారు.. అక్కడ పరిస్థితులను వివాహ వేడుకల్లో ఆస్వాదించాలనుకునే వారు కాస్త డబ్బు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సందర్శన కోసం అయితే టికెట్స్ తక్కువే అయినా.. వివాహ తంతు వేషధారణ గిరిజనుల్లో మమేకం అయ్యేలా అనుభూతిని పొందాలంటే ఒక్కో వేడుకకు అవసరాన్ని బట్టి ఐదు వేల నుంచి 10 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని చేసుకునే పెళ్లిళ్ల కంటే.. ఈ గిరి గ్రామదర్శినిలో గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవడం జీవితంలో కచ్చితంగా మరపురాని విధంగానే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also read:

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

Dalailama: మత సామరస్యం విషయంలో భారత్‌ ప్రపంచానికే మార్గదర్శి.. ఇక్కడి ప్రజల జీవనం నన్నెంతగానో ఆకట్టుకుంటోంది: దలైలామా

UP Politics: హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం.. జనంలోకి బీజేపీ.. సీఎం యోగిను టార్గెట్ చేసిన అఖిలేశ్‌, ప్రియాంక!