ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ.. ఉద్యోగాలే ఉద్యోగాలు

ఏపీ ప్రజలకు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో నూతనంగా నిర్మాణం కాబోతున్న రాజధానిలో అంత్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కాబోతుంది. అమరావతిలోని శాఖమూరులో 4 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి రావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, అమరావతి పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారనుంది.

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ.. ఉద్యోగాలే ఉద్యోగాలు
Amaravati Giis School

Edited By:

Updated on: Jun 10, 2026 | 7:27 PM

ప్రజారాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ సంస్థలు, ఆరోగ్య, విద్యా రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు రాజధాని వైపు అడుగులు వేస్తున్న సమయంలో మరో అంతర్జాతీయ విద్యాసంస్థ అమరావతిలో ఏర్పాటు కానుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్న గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (GIIS) అమరావతిలో తమ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఏపీ సీఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని నగరంలో అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందుబాటులోకి రావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అదే సమయంలో అమరావతిని నివాసయోగ్యమైన, పెట్టుబడులకు అనుకూలమైన ఆధునిక నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఈ నిర్ణయం మరింత బలం చేకూర్చనుంది.

శాఖమూరులో 4 ఎకరాల్లో అంతర్జాతీయ విద్యాలయం

అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామంలో 4 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించారు. ఏపీ సీఆర్డీఏ మరియు GIIS K12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జూన్ 10న అధికారిక ఒప్పందం జరిగింది. ఏపీ సీఆర్డీఏ తరఫున జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) జుబిన్ రాయ్, సంస్థ తరఫున కంట్రీ డైరెక్టర్ రాజీవ్ కౌల్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, ఆధునిక క్రీడా వసతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో రాజధాని ప్రాంతంలోని విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.

ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త ఊతం

అంతర్జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు కేవలం విద్యారంగానికే పరిమితం కాదు. ఉపాధ్యాయులు, పరిపాలనా సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, భద్రతా సిబ్బంది, రవాణా, నిర్వహణ సేవలు వంటి అనేక రంగాల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా ఇటువంటి విద్యాసంస్థలు ఏర్పడటం వల్ల రాజధాని ప్రాంతంలో గృహ నిర్మాణం, వాణిజ్య కార్యకలాపాలు, సేవారంగం కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, పారిశ్రామిక, సేవారంగ సంస్థలు తమ ఉద్యోగుల కుటుంబాలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటాన్ని కీలక అంశంగా పరిగణిస్తాయి. ఈ నేపథ్యంలో GIIS రాక అమరావతి పెట్టుబడి ఆకర్షణను మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

విద్యా మౌలిక వసతుల బలోపేతానికి మరో అడుగు

గత కొంతకాలంగా అమరావతిలో విద్య, వైద్యం, పరిపాలన, నైపుణ్యాభివృద్ధి రంగాలకు చెందిన సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా రాజధానిలో విద్యా మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్తు తరాలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కూడా అదే దిశలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది మరో బలమైన అడుగుగా నిలవనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.

Follow Us